రైతన్నలపై టీఆర్ఎస్ ప్రేమ.. అసలు కథేంటి..?
రాష్ట్రం ఏదయినా రైతన్నల కష్టాలు మాత్రం కామన్. సకాలంలో వర్షాలు కురవక, పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేక, పెట్టుబడులు పెరిగిపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటారు. చాలామంది వ్యవసాయాన్ని వదిలి ఇతర వ్యాపకాల్లోకి వెళ్లడానికి కూడా అదే ప్రధాన కారణం. అయితే రైతన్నల కష్టాలు తీరిస్తేనే ప్రభుత్వాలకు మనుగడ. అందుకే కేంద్రం, నుంచి రాష్ట్రాల వరకు రైతన్నల జపం చేస్తుంటాయి ప్రభుత్వాలు. ఆర్థిక సాయాన్ని అందిస్తూ కంటి తుడుపు చర్యలు చేపడుతుంటాయి. తాజాగా తెలంగాణలో కూాడ రైతన్నలపై ఎనలేని ప్రేమ కురిపిస్తోంది ప్రభుత్వం. కేసీఆర్ హయాంలో రెండో హరిత విప్లవం మొదలైందని అన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రాభివృద్ధిలో వ్యవసాయానిదే కీలక పాత్ర అని చెప్పారాయన. ఐటీ మంత్రి ఇలా వ్యవసాయాన్ని హైలెట్ చేయడం ఇక్కడ విశేషం. వ్యవసాయ రంగంపై సీఎం కేసీఆర్ ఏకంగా ఓ మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి, మార్పులు, నూతన విధానాలపై అధ్యయనం చేయాలని చెప్పారు.
ప్రత్యామ్నాయ పంటలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకోసం తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. వ్యవసాయంలో సాంకేతికత ఉపయోగించుకోవాలని, తద్వారా గణనీయమైన అభివృద్ధి సాగించాలన్నారు కేసీఆర్. కేవలం 3 శాతం జనాభా ఆధారపడ్డ అమెరికా వ్యవసాయ రంగం ఆ దేశ జీడీపీలో మొత్తం 90 శాతం సంపదను సృష్టిస్తోందని అన్నారు కేటీఆర్. తెలంగాణ జీడీపీలో కూడా వ్యవసాయానికి కీలక పాత్ర కావాలని ఆయన చెప్పారు.
రైతులకు ఆర్థిక సాయం విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఉదారంగా ఉంటుందని చెప్పారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే రైతు బంధు పేరుతో ఆర్థిక సాయం అందుతున్నా అది కేవలం భూస్వాములకు, పెద్ద రైతులకు ఉపయోగపడుతుందనే విమర్శలున్నాయి. ఇన్ కమ్ ట్యాక్స్ కట్టే వారు కూడా రైతు బంధు అందుకున్నారని ఆమధ్య ఈటల రాజేందర్ కూడా విమర్శించారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. చిన్న, సన్నకారు రైతులను కూడా దగ్గరకు తీయబోతోంది. ఆ దిశగా టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది.