మోడీ వర్సెస్ సోనియా..ఢీ కొట్టగలరా ?

Veldandi Saikiran
దేశ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. త్వరలో సోనియా గాంధీ సమక్షంలో ప్రతిపక్షాల సమావేశం కానున్నాయి. అయితే... ఈ సమావేశం ఆగస్టు 20 న
ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  అధికార బిజేపి ని దీటుగా  ఎదుర్కుని నిలువరించేందుకు, భావసారూప్యతగల పార్టీలన్నింటినీ ఏకం చేసి, మరింత బలీయమైన ఉమ్మడి పోరుకు సిద్ధం అవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ సమావేశాలలో మోడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసిన ఉమ్మడి పోరు ను మరింత సమర్ధవంతంగా కొనసాగించేందుకు, ప్రతిపక్షాల ఐక్యతను పటిష్టంచేసేందుకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు.  కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యపక్షం గా ఉండి అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ సమావేశానికి రావాలని ఆహ్వానాలు వెళ్లినట్లు తెలుస్తోంది.  

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ , మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్దవ్ థాకరే (శివసేన), ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ( జార్ఖండ్ ముక్తి మోర్చా) లను కూడా ఆహ్వానించాలని సోనియా గాంధీ ఆలోచన చేస్తున్నారు. అలాగే... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తో సహా, ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలను ఆహ్వానించనున్నారు సోనియా గాంధీ. అయితే, ప్రతిపక్ష నేతలు  అందుబాటులో ఉండే అవకాశాన్ని బట్టి సమావేశం నిర్వాహించాలని ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఇటీవల అసమ్మతి గళాన్ని వినిపించిన కపిల్ సిబల్ రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన “డిన్నర్ సమావేశం” తర్వాత, సోనియా గాంధీ ప్రతిపక్షాల సమావేశం నిర్వహిస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది.

 ఇక అటు ప్రధాన ప్రతి పక్ష పార్టీ అయిన కాంగ్రెస్ బలపడితేనే, ప్రతిపక్షాల ఐక్యత పటిష్టంగా ఉంటుందని  పలు ప్రతిపక్షాలు ఆలోచన చేస్తున్నాయి. అన్ని ప్రతి పక్షాలు కలిసి.. పోరాడితే మోడీ సర్కార్‌ కూల్చగలమని యోచిస్తున్నాయి. అయితే...300 పైగా సీట్లు ఉన్న మోడీ సర్కార్‌ ను కూల్చడమంటే మాములు విషయం కాదని కొన్ని పార్టీలు వణుకుతున్నాయి. మోడీ సర్కార్‌ వైఫల్యాలను ప్రజల్లోకి... సమర్థవంతంగా తీసుకుపోగలిగితే... ప్రతిపక్షాలు సక్సెస్‌ కాగలవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సామాన్యుడి భారం పడుతున్న గ్యాస్‌, చమురు, వంట నూనెలు ఇలాంటి విషయాలను ప్రతిపక్షాలు టార్గెట్‌ చేస్తే.. ఫలితం ఉంటుందని అంటున్నారు. అయితే... ఈ ప్రతి పక్ష పార్టీలు ఏ మేరకు..ఐకమత్యంగా పనిచేసి... మోడీ సర్కార్‌ ను ఢీ కొడతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: