కరోనా విషయంలో ఊపిరి పీల్చుకునే వార్త..!
ఇక తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో 50వేల 126మందికి పరీక్షలు చేయగా.. 245మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. తాజాగా ఒకరు కోవిడ్ మహమ్మారి వల్ల చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3వేల 842కు చేరుకుంది. అటు మొత్తం కరోనా కేసుల సంఖ్య 6లక్షల 52వేల 380గా ఉంది. వైరస్ బారి నుంచి మరో 582మంది కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం 7వేల 268యాక్టివ్ కేసులున్నాయి.
ఏపీలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,506 కరోనా కేసులు నమోదయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా కరోనా మహమ్మారి వల్లమరో 16మంది చనిపోయినట్టు పేర్కొంది. అటు 1,835మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు వెల్లడించింది. ప్రజలంతా కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని హెచ్చరించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 17వేల 865యాక్టివ్ కేసులున్నాయి.
ఇక ఏపీలో కరోనా కర్ఫ్యూ మరోసారి పొడిగించింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం రాత్రి 10గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఉన్న నైట్ కర్ఫ్యూని ఈ నెల 21వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు కరోనా డెల్టా వైరస్ ఆస్ట్రేలియాను వణికిస్తోంది. దీంతో స్థానిక ప్రభుత్వాలు మరిన్ని కఠిన చర్యలు అమలు చేస్తున్నాయి. ఆ దేశంలో అతిపెద్ద నగరమైన సిడ్నీలో బయట కనిపిస్తే భారీ జరిమానాలు విధిస్తున్నారు. 8వారాల పాటు సిడ్నీలో లాక్ డౌన్ పెట్టినా .. కోవిడ్ వ్యాప్తి తగ్గట్లేదు. రాజధాని కాన్ బెర్రాలోనూ వైరస్ ను కట్టడి చేయలేకపోతున్నారు. ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు తెలిపారు.