దేశాలన్నీ అప్రమత్తం.. తమ వారిని కాపాడుకునేందుకు సన్నాహాలు..!

NAGARJUNA NAKKA
తాలిబన్లు ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లోనూ అడుగుపెట్టడంతో.. తమ దేశ పౌరులను వెనక్కి సురక్షితంగా రప్పించడంపై అన్ని దేశాలు దృష్టిపెట్టాయి. ఇందులో భాగంగా భారత్, అమెరికా, యురోపియన్ దేశాలు, న్యూజిలాండ్ సహా ఇతర దేశాలు ప్రత్యేక విమాన సర్వీసులు నడుపుతున్నాయి. దీంతో కాబూల్ విమానాశ్రయానికి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అటు న్యూజిలాండ్.. కొందరు ఆప్ఘనిస్థాన్ పౌరులనూ తమ దేశంలోకి అనుమతిస్తామని ప్రకటించింది.

రక్తపాతాన్ని నివారించేందుకే తాను దేశం విడిచి వెళ్లిపోయినట్టు ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఫేస్ బుక్ వేదికగా వెల్లడించారు. ఇకపై ఆప్ఘాన్ ప్రజల గౌరవం, సంపద పరిరక్షణకు తాలిబన్లు బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. గడిచిన 20ఏళ్లు దేశ రక్షణకు తన జీవితాన్ని అంకితం చేసినట్టు చెప్పారు. ఈ తరుణంలో దేశాన్ని విడిచి పెట్టడమనే కఠిన నిర్ణయం తనను బాధించిందని తెలిపారు. తాలిబన్లు ప్రజల హృదయాల్ని మాత్రం గెలవలేదన్నారు.

కాబూల్ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు లొంగిపోయిన ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం.. అధికారాన్ని వారి చేతుల్లో పెట్టేసింది. దీంతో కొత్త అధ్యక్షుడిగా ముల్లా అబ్ధుల్ ఘనీ బరాదర్  బాధ్యతలు చేపట్టే అవకాశముంది. అటు ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ల దురాక్రమణలపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బలప్రయోగం అంతర్యూద్దానికి దారి తీసే అవకాశముందని ఆవేదన చెందుతోంది.

ఆప్ఘాన్ లో అసలు ఏం జరిగిందంటే.. 2001లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ జూనియర్ సారథ్యంలో చేసిన దాడులతో అప్ఘాన్ తాలిబన్లు పారిపోయారు. దీంతో అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. దాదాపు 2దశాబ్ధాల తర్వాత మళ్లీ ఆ దేశం తాలిబన్ల వశమైంది. ఆప్ఘాన్ నుంచి బైడెన్ ప్రభుత్వం తమ బలగాలను వెనక్కి రప్పించడంతోనే తాలిబన్లు రెచ్చిపోయారు. ఆప్ఘాన్ సైన్యం చతికిలపడటంతో మెల్లమెల్లగా దేశ పీఠంపై పాగా వేశారు. కాగా ఈ సంస్థకు పాక్ అండదండగా నిలుస్తోంది. ఆప్ఘనిస్థాన్ లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులతో దేశాలు అప్రమత్తమయ్యయి. తమ దేశ వాసులను స్వదేశాలకు రప్పించే చర్యలను చేపట్టాయి.







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: