తెలంగాణను ఆపండి.. కృష్ణాబోర్డుకు ఏపీ కంప్లయింట్..?
శ్రీశైలం రిజర్వాయర్లో నీటిమట్టం 854 అడుగులకు చేరితే రాయలసీమకు నీరివ్వలేమని ఆంధ్రప్రదేశ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాయలసీమతో పాటు చెన్నై నగరానికి కూడా తెలుగు గంగ ప్రాజక్టు ద్వారా తాగునీటిని సరఫరా చేయలేమని ఏపీ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు తెలిపింది. తెలంగాణ విద్యుత్ ఉత్పాదన ద్వారా వస్తున్న నీరు సాగర్లో నిలిపే అవకాశం లేదని.. ఇప్పటికే సాగర్లో పూర్తి స్థాయి నీటిమట్టం ఉందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఇప్పుడు తెలంగాణ శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పాదనకు వాడుతున్న నీరంతా సముద్రంలో వృధాగా కలిసిపోతోందని ఏపీ వాదిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ విద్యుత్ ఉత్పాదన వల్ల వృధా అవుతున్న నీటిని వారికి కేటాయించిన కోటా నుంచి మినహాయించాలని తన ఫిర్యాదులో పేర్కొంది. తెలంగాణతో విద్యుత్ ఉత్పాదనను తక్షణమే ఆపివేయించాలని కేఆర్ఎంబీని కోరిన ఏపీ ప్రభుత్వం కోరింది. నిన్న మొన్నటి వరకూ ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఇబ్బడి ముబ్బడిగా వర్షాలు పడటం వల్ల ఈ ఏడాది శ్రీశైలం జలాశయం , నాగార్జున సాగర్, పులిచింతల వంటి జలాశయాలు ముందుగానే నిండిపోయాయి. ఒక దశలో అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తేసి నీళ్లు సముద్రం పాలు చేయాల్సి వచ్చింది. అలాంటిది ఇప్పుడు మళ్లీ శ్రీశైలం నుంచి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటిమట్టం తగ్గుతోందని ఏపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి ఈ ఫిర్యాదుపై కృష్ణా బోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.