ఆ మూడు దేశాలకు ముచ్చెమటలు..!

NAGARJUNA NAKKA
తాలిబన్ల అంశంలో పాక్, చైనా, రష్యాలు లోలోపల భయాందోళనకు గురవుతున్నాయి. ఆ ఉగ్రవాదం తమ దేశాల్లో ఎక్కడ వ్యాపిస్తుందోనని భయపడుతున్నాయి. ఆప్ఘాన్ సరిహద్దుల్లో పాక్ ఇప్పటికే కంచె నిర్మించింది. తాలిబన్ల మృదుత్వంతో నమ్మలేని స్థితిలో చైనా ఉంది. ఆప్ఘాన్ మత ఛాందసవాదం మధ్య ఆసియాకు రావొచ్చని రష్యా కంగారు పడుతోంది. ఆప్ఘాన్ శరణార్థులు, డ్రగ్స్, హజారా ముస్లింలపై తాలిబన్ల అత్యాచారాలు లాంటివి ఇరాన్ కు సవాల్ కానున్నాయి.

ఇక అమెరికా అయితే తాలిబన్లకు పెద్ద షాక్ ఇచ్చింది. తమ దేశంలోని బ్యాంకుల్లో ఉన్న ఆప్ఘాన్ నిధులపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించినట్టు సమాచారం. దాదాపు 9.5 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను స్తంభింపజేసినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తాలిబన్ల చేతిలో ఆప్ఘాన్ నిధులు దుర్వినియోగం అవుతాయనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తాలిబన్లు కాబుల్ ను హస్తగతం చేసుకోగానే అమెరికా ట్రెజరీ విభాగం ఈ చర్యలు తీసుకుందట.

మరోవైపు తాలిబన్లపై ఆప్ఘానిస్థాన్ పౌరుల నుంచి తిరుగుబాటు మొదలైంది. వారి అరాచకాలను తట్టుకోలేకపోతున్న స్థానికులు.. రోడ్లపైకి వచ్చి ఆందోళ చేస్తున్నారు. బుధవారం జలాలాబాద్ లో తాలిబన్ జెండాలను తొలగించి.. తమ దేశ జాతీయ జెండాలను ఉంచారు. దీంతో తాలిబన్లు నిరసన కారులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. 10మంది గాయపడ్డారు. మరోవైపు తమ హక్కులను కాపాడాలని కాబుల్ లో నలుగురు మహిళలు ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళన చేశారు.


ఇక అష్రఫ్ ఘనీ తమ దేశంలో ఉన్నట్టు యూఏఈ ధ్రువీకరించింది. మానవతా దృక్పథంతోనే ఆప్ఘాన్ మాజీ అధ్యక్షుడు, ఆయన కుటుంబానికి ఆశ్రయమిచ్చామని అక్కడి ప్రభుత్వం తెలిపింది. అయితే ఘనీ ప్రస్తుతం ఏ నగరంలో ఉన్నారనేది మాత్రం వెల్లడించలేదు. మరోలైపు ఆప్ఘానిస్థాన్ లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాలిబన్లు మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తో  చర్చలు జరుపుతున్నారు. రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వంపై స్పష్టత రానుంది.  





 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: