అప్పులివ్వడంలో ఆంధ్ర ఆఖరు..
కొవిడ్ కారణంగా ప్రైవేటు వైద్యంతో ప్రజలు అప్పులపాలవుతున్నారు. వారిని ఆదుకోడానికి ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోతున్నాయి. కనీసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు లేవు, ఒకవేళ ఉన్నా కూడా ఆస్పత్రిలో బెడ్లు దొరకడం కష్టంగా మారిన పరిస్థితి. దీంతో కచ్చితంగా మధ్యతరగతి జీవి ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితి. వైద్యం సంగతి దేవుడెరుగు బిల్లు మాత్రం తడిసి మోపెడవుతుంది, అయ్యింది కూడా. ఈ క్రమంలో చాలామంది పేద, మధ్యతరగతి ప్రజలు అప్పులపాలయ్యారు. అలాంటి వారికి రుణాలిచ్చి ఆదుకోవాల్సిందిగా ఆమధ్య కేంద్రం, బ్యాంకులను ఆదేశించింది. కరోనా కష్టకాలంలో అదనపు వడ్డీ లేకుండా ఈఎంఐలు వాయిదా వేసుకోడానికి అవకాశం ఇచ్చినట్టు, ఉదారంగా వ్యక్తిగత రుణాలు అందించాలని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 1.33 లక్షలమందికి బ్యాంకులు కరోనా లోన్లు ఇచ్చాయి. ఈ లోన్లు ఇచ్చే వ్యవహారంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. తమిళనాడులోని ప్రభుత్వరంగ, ప్రైవేటు బ్యాంకులు మొత్తం 33,917 మందికి కొవిడ్ లోన్లు ఇచ్చాయి. ఆ తర్వాత కర్నాటక 20,391మందికి కొవిడ్ లోన్లు ఇచ్చింది. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర.. తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏపీ ఎక్కడ ఉందా అని ఆరా తీస్తే.. చివరి స్థానం దక్కింది. ఏపీలో కొవిడ్ లోన్లు తీసుకున్న వారి సంఖ్య కేవలం 2,791 మాత్రమే. తెలంగాణ ఈ విషయంలో కాస్త మెరుగు, 3389 మందికి కొవిడ్ రుణాలిచ్చింది. అంటే కొవిడ్ రుణాలివ్వడంలో తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు మరీ ఉదారంగా లేవని అర్థమవుతోంది.
అవగాహన లేమి మరో కారణం..
కరోనా లోన్ల గురించి ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం కూడా దీనికి మరో కారణం. కొవిడ్ వచ్చినవారు ఆన్ లైన్ లో పాజిటివ్ రిపోర్ట్ ని డౌన్ లోడ్ చేసుకుని, తమ కుటుంబ సభ్యుల ద్వారా 15రోజుల లోపు బ్యాంకుని సంప్రదిస్తే.. వారికి రుణ సదుపాయం ఉంటుంది. అయితే ఇక్కడ కూడా బ్యాంకులు సవాలక్ష కండిషన్లు పెట్టడం విచారకరం. ఉద్యోగస్తులు, ఇతర రుణాలు లేనివారికే తాము లోన్లు ఇస్తామంటూ తెగేసి చెబుతున్నారు అధికారులు. అసలే కరోనా కష్టాల్లో ఉండి బ్యాంకులోన్లకోసం వస్తే, వారిని వట్టి చేతులతో తిప్పి పంపుతున్నారు. ఈ విషయంలో తమిళనాడు మాత్రం ముందడుగులో ఉంది. కొవిడ్ బాధితులకు రుణాల ద్వారా ఉపశమనం కలిగించింది.