తొక్కిసలాటలో ఏడుగురు మృతి.. మనోళ్లు మాత్రం..!

NAGARJUNA NAKKA
ఆప్ఘానిస్థాన్ లోని కాబూల్ విమానాశ్రయం దగ్గర పరిస్థితులు అంతకంతకూ దిగజారిపోతున్నాయి. తాలిబన్ల చెర నుంచి బయటపడేందుకు దేశం విడిచి పారిపోవాలనే తలంపుతో ఆప్ఘాన్లు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా కాబూల్ విమానాశ్రయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ఆప్ఘాన్ లు మృతి చెందారు. ఈ మేరకు బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది.
మరోవైపు ఆప్ఘానిస్థాన్ లో తాలిబన్ల చెర నుంచి భారతీయులను రక్షించి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కేంద్రం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 168మందితో అక్కడి నుంచి బయలు దేరిన సీ-17 విమానం గాజియాబాద్ లోకి హిండన్ వైమానిక స్థానరంలో సురక్షితంగా దిగింది. 107 భారతీయులు సహా మొత్తం 168మంది వాయుసేన విమానంలో భారత్ చేరుకున్నారు. వీరిలో ఆప్ఘాన్ ఎంపీ కూడా ఉన్నారు.

ఆప్ఘానిస్థాన్ లో చిక్కుకున్న కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. విజయవాడలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.0866-2436314, 7780339884 టోల్ ఫ్రీ wనంబర్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాగా.. ఆప్ఘానిస్థాన్ లో చిక్కుకున్న కార్మికులు వివరాలను ఫోన్ చేసి చెప్పవచ్చని అధికారులు చెప్పారు.
ఆప్ఘానిస్థాన్ లో తాలిబన్ లు ఉన్నత విద్యపై కీలక ఆదేశాలు జారీ చేశారు. కోఎడ్యుకేషన్ క్యాన్సిల్ అవ్వగా.. మహిళా ఉపాధ్యాయులు కేవలం అమ్మాయిలకే బోధించాలనీ.. మగ విద్యార్థులకు బోధించకూడదని ఆదేశించారు. తాలిబన్ల తాజా నిర్ణయంతో ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇబ్బందులు రానున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో సుమారు 40వేల మంది విద్యార్థులు 2వేల మంది బోధనా సిబ్బంది ఉన్నారు.
ఇక మన దేశంలోకి లష్కరే తోయిబా, జైషే మహ్మద్ లాంటి ఉగ్ర సంస్థలకు చెందిన ఉగ్రవాదుల చొరబాట్లు పెరిగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇన్నేళ్లుగా తాలిబన్లకు సాయం అందించేందుకు ఈ సంస్థలు తమ ఉగ్రవాదులను అక్కడికి పంపాయని.. ఇప్పుడు ఆప్ఘాన్ లో తాలిబన్ల రాజ్యం వచ్చేయడంతో ఈ సంస్థలు భారత్ పై దృష్టి పెడతాయని తెలిపాయి. ఆప్ఘాన్ జైళ్ల నుంచి తాలిబన్లు విడుదల చేసిన వారిలో ఎక్కువగా ఈ సంస్థల ఉగ్రవాదులే ఉన్నట్టు చెప్పాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: