పత్తా లేని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ .. ఇలాగైతే ఎలా బాసూ..?

Chakravarthi Kalyan
ఆర్ఎస్‌ ప్రవీణ్‌ కుమార్.. ఓ మాజీ ఐపీఎస్.. స్వచ్చంధంగా పదవి నుంచి బయటకు వచ్చిన వ్యక్తి.. ఖాకీ అధికారం కూడా వదులుకుని.. తెల్లచొక్కా తొడుక్కుని దళిత, గిరిజన పిల్లల బాగు కోసం ఏళ్లకు ఏళ్లు శ్రమించినవాడు.. ఎస్సీ, ఎస్టీ పిల్ల ఉజ్జ్వల భవిష్యత్త్ కోసం కలలు కన్నవాడు. ఆ కలలను చాలా వరకూ సాకారం చేసిన వాడు. గురుకుల విద్యాలయాల సంస్థ ద్వారా ఆయన చేసిన సేవలకు ఎంతో గుర్తింపు వచ్చింది. అయితే.. ఆయన గురుకులాల ద్వారా చేసిన సేవ ఒక ఎత్తు.. అదే గురుకులాల మాజీ విద్యార్థులు ద్వారా ఆయన స్థాపించిన స్వేరోస్‌ సంస్థ మరో ఎత్తు.


ఈ స్వేరోస్‌ ద్వారా ఆయన లక్షల సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకే ఆయన తొలిసారి బీఎస్పీలో చేరుతూ నల్గొండలో నిర్వహించిన సభ బ్రహ్మాండంగా సక్సస్ అయ్యింది. చాలా మంది ఆ స్థాయిలో సభ పెడతారని.. అంతగా జనం వస్తారని ఊహించలేదు. అయితే ఆరంభం బాగానే ఉంది.. మరి ఆ తర్వాత.. రాజకీయాల్లో చేరాక.. ఓ లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాక.. నిత్యం ప్రజలతో మమేకం కావాలి.. ఏదో ఒక కార్యక్రమం నిర్వహించాలి.. మీడియాలోనూ కనిపిస్తుండాలి. అప్పుడే పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది.


కానీ.. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌.. తొలి సభ తర్వాత మళ్లీ ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ కార్యక్రమం ఏదీ నిర్వహించలేదు. అయితే ఆయన నల్గొండ సభ తర్వాత కరోనా బారిన పడినట్టు తెలిపారు. స్వల్ప లక్షణాలే ఉన్నట్టు చెప్పారు. మొత్తానికి తొలి సభ తర్వాత మళ్లీ ప్రవీణ్‌ కుమార్ మీడియాలో కనపించలేదు. బహుశా ఆయన తన ప్రణాళికలు తాను సిద్దం చేసుకోవచ్చు.. కానీ.. ఈ సోషల్ మీడియా కాలంలో ఇంతకాలం కనిపించకుండా ఉండటం కూడా సరైంది కాదు. కరోనా కారణాలతో జనం మధ్యకు రాలేక పోయినా.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ అయినా వాడుకోవచ్చు. తెలంగాణ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్న కాలంలో ఇలా సైలంట్‌గా ఉండటం అంత మంచిది కాదని ప్రవీణ్‌ కుమార్‌ గుర్తించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

rsp

సంబంధిత వార్తలు: