బిగ్ డే : ఇవాళ జగన్ బెయిల్ రద్దవుతుందా..?
ఇవాళ సీఎం జగన్ బెయిల్ రద్దు అంశంపై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరగబోతోంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై కోర్టు ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టింది. ఇవాళ జగన్ బెయిల్ రద్దుపై తీర్పు వచ్చే అవకాశం ఉంది. దీంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. జగన్ బెయిల్ రద్దు అయితే ఏం జరగబోతుందున్న ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నాయి.
జగన్‌కు బెయిల్ సమయంలో ఇచ్చిన షరతులు ఉల్లంఘించినందున జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు వాదిస్తూ వచ్చారు. జగన్ ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ వాదిస్తున్నారు. జగన్ తన కేసుల్లో సహనిందితులు, సాక్షులుగా ఉన్న కొందరు అధికారులకు కీలక పదవులు కట్టబెట్టారని రఘురామ వాదించారు. పిటిషన్ వేసినందుకు తనపై సీఐడీ ద్వారా తప్పుడు కేసులు పెట్టి వేధించారని వాదించారు.
అయితే.. కోర్టు విధించిన షరతుల్లో ఒక్కటి కూడా ఉల్లంఘించలేదని జగన్ వాదిస్తూ వచ్చారు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం రఘురామ పిటిషన్ దాఖలు చేశారని జగన్ వాదిస్తున్నారు. ఈ కేసులో సీబీఐ వైఖరి కూడా చర్చకు దారి తీసింది. విచక్షణ మేరకు పిటిషన్ పై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలంటూ సీబీఐ తటస్థ వైఖరిని వ్యక్తం చేసింది. ఈ కేసులో గత నెల 30న వాదనలు ముగిశాయి. ఇవాళ తీర్పు రాబోతోంది.