బ‌స్సు బోల్తా.. ప‌దిమందికి గాయాలు.. ఎక్కడంటే..?

Suma Kallamadi
ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఆటోలో నుంచి జారి ప‌డి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే సూర్యాపేట జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడి 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివ‌రాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా తర్లుపాడు, కొనకనమిట్ల మండలాల సరిహద్దు కలుజువ్వలపాడు జాతీయ రహదారిపై బుధ‌వారం వేగంగా వెళ్తున్న ఆటో నుంచి నలుగురు వ్యక్తులు జారిపడి మృతి చెందారు. అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు చనిపోగా, ఆస్పత్రికి తరలించే మార్గమధ్యలో మరో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో కనకం కార్తీక్‌, అనిల్‌, బోగాను సుబ్బారావు, శ్రీనుగా స్థానికుల సాయంతో మృతుల‌ను పోలీసులు గుర్తించారు. ఓ పెళ్లి వేడుకకు వధువును తీసుకుని త్రిపురాంతకం మండలం సోమేపల్లి నుంచి పొదిలి అక్కచెరువు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
వధువు ఆటోలో ముందు కూర్చోవడంతో ఆమెకు ఎలాంటి ప్రమాదం కాలేదు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు న‌మోదు చేశారు. ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో ఆ పెళ్లి ఇంట విషాదం నెలకొంది. ఈ ఘటనతో వధువు సహా కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
తెలంగాణలోనూ బుధవారం తెల్లవారు జామునే ఓ రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ప్రయాణికులతో కాకినాడ నుంచి హైద‌రాబాద్‌ వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలోని ఆకుపాముల జాతీయ రహదారిపై ఈ ప్రమాదం  జరిగినట్లు తెలుస్తుంది.  ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 10 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థ‌లానికి చేరుకొని, వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, సంఘటన జరిగిన సమయంలో బస్సులో 33 మంది ఉన్నట్లు తెలుస్తుంది. వారిలో ఎవ‌రికీ ప్రాణ నష్టం జరగలేదు. డ్రైవర్ నిర్లక్ష్యమే కార‌ణ‌మ‌ని, అతివేగంగా న‌డ‌ప‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం సంభ‌వించింద‌ని మునగాల ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: