వాలంటీర్లపై మరీ ఇంత పెత్తనమా..?
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే వాలంటీర్లు తమకు వస్తున్న ప్రతిఫలానికి ఎన్నోరెట్లు అదనంగా పనిచేస్తున్నారు. వారంలో మూడు రోజులు అటెండెన్స్ వేయాలి, వీఆర్వోలు, పంచాయతీ సెక్రటరీలు ఎప్పుడు ఏ లిస్ట్ రెడీ చేయమన్నా నిముషాల్లో అప్ డేట్ చేయాలి. క్షేత్ర స్థాయిలో పని మొత్తం వాలంటీర్లపైనే నడుస్తోంది. దీనికితోడు.. ఇంటింటికీ రేషన్ సరకుల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంది. ఇన్ని ఒత్తిడుల మధ్య వాలంటీర్ ఉద్యోగం అనేది గాలిలో దీపంలా మారడం మాత్రం విచిత్రం.
ఎక్కడ ఏ ఎమ్మెల్యేకు కోపమొచ్చినా, కనీసం సర్పంచ్ కి నచ్చకపోయినా వాలంటీర్ పోస్ట్ ఊడిపోతుంది. నియామకం చేసేటప్పుడు సవాలక్ష ప్రశ్నలు అడుగుతారు కానీ, తీసిపారేసే ముందు మాత్రం వారి సమాధానం ఎవరికీ అవసరం లేదు. ఒక నియోజకవర్గంలో 267మంది వాలంటీర్లను తొలగించాం.. 10మంది సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేశామంటూ ఎమ్మెల్యే చెబుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు వాలంటీర్లపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారని తెలుస్తోంది. తప్పు చేసినవారిని శిక్షించడం తప్పు కాదు కానీ, మరీ ఉద్యోగ భద్రత లేని సందర్భంలో పనిచేయడం వాలంటీర్లకు కత్తిమీద సాములా మారుతోంది.
ఒక్క ధర్మవరంలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. వాలంటీర్లకు ప్రత్యేక సంఘాలు లేవు, వారి తరపున మాట్లాడేవారు కూడా లేరు. ఉన్నతాధికారులు, అధికార పార్టీల నేతల మద్దతు ఉన్నంత వరకే వారికి ఆ పోస్ట్ ఉంటుంది. ఎవరికి ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కలిగినా తొలి వేటు వాలంటీర్ పైనే పడుతోంది. ఇటీవల కాలంలో వాలంటీర్ పోస్ట్ వద్దు అంటూ చాలామంది వెనకడుగు వేయడానికి కారణం కూడా ఇదే. పారితోషికాన్ని పెంచరు అనే క్లారిటీ వచ్చేసింది. అయినా కూడా ఇంకా పొలిటికల్ సేవ చేయాలంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉంటుంది?