బంపర్ ఆఫర్ కోసం విశాఖ ‘ఫ్యాన్’ ఎమ్మెల్యేలు పోటీ...!
ఎందుకంటే విశాఖపట్నంకు సీఎం జగన్ భారీ బంపర్ ఆఫర్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. విశాఖ జిల్లాకు జగన్ రెండు మంత్రి పదవులు వరకు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖపట్నంలో అవంతి శ్రీనివాస్ ఒక్కరే జగన్ క్యాబినెట్‌లో ఉన్నారు. ఈయన్ని నెక్స్ట్ క్యాబినెట్ నుంచి సైడ్ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. ఆయన్ని కంటిన్యూ చేసిన చేయకపోయినా విశాఖకు రెండు లేదా మూడు మంత్రి పదవులు ఖాయమనే తెలుస్తోంది.
పైగా విశాఖ రాజధాని కానుండటంతో జగన్ జిల్లాకు మంత్రివర్గంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అందుకే జిల్లాలో ఉన్న నాయకులు మంత్రి పదవి దక్కించుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలా పదవిని ఆశిస్తున్న వారిలో...అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు.
వైసీపీలో యువ ఎమ్మెల్యేగా మంచి క్రేజ్ తెచ్చుకున్న గుడివాడకు..పదవి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సైతం పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సీనియర్ ఎమ్మెల్యేగా తనకు మంత్రి అయ్యే అర్హత ఉందని కరణం భావిస్తున్నారు. అటు పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు...సైతం ఎస్సీ కోటాలో పదవి రాకపోతుందా అని చూస్తున్నారు. ఇక మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజులు సైతం తమకు ఏమన్నా ఛాన్స్ రాకుండా ఉంటుందని అని అనుకుంటున్నారట. అలాగే జిల్లాలో జూనియర్ ఎమ్మెల్యేలు సైతం లక్కీగా పదవి వస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు. మొత్తానికైతే మంత్రి పదవి కోసం విశాఖ వైసీపీ ఎమ్మెల్యేలు గట్టిగానే పోటీ పడుతున్నారు.