ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేయని డాక్టర్స్ కు షాకింగ్ న్యూస్ ?

VAMSI
ప్రాణాలు పోసే దేవుళ్ళుగా డాక్టర్లను పూజిస్తుంటారు ప్రజలు. కొందరు వైద్యులు తమ వృత్తే దైవంగా భావించి ప్రజలకు సేవ చేస్తుంటే మరికొందరు డాక్టర్లు మాత్రం ధనానికి ప్రాధాన్యం ఇచ్చి పక్కదారి పడుతున్నారు. అలాంటివారికి చక్కటి గుణపాఠం చెప్పేలా కీలక నిర్ణయాన్ని తీసుకుంది సీఎం స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం. రోగులకు ప్రాణదానం చేసే ఆసుపత్రులలో ప్రవేటు ఆసుపత్రులు కన్నా ప్రభుత్వ ఆసుపత్రుల పాత్రే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సామాన్యుడికి ఆరోగ్య సమస్యలు తలెత్తితే ప్రైవేటు బిల్లులకు బలవడం కన్నా కాస్త వసతులు తక్కువైనా ప్రభుత్వ ఆసుపత్రికి పోవడం మిన్న అనుకుంటాడు. తమని ఓటు వేసి గెలిపించిన ప్రజల ప్రాణాలను రక్షించడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత సేవను అందిస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం అంతంతమాత్రంగా ఉంటోంది.

అందులోనూ సమయానికి వైద్యులు అందుబాటులో లేక పేషంట్లు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అయితే వర్కింగ్ వేళల్లోనూ వైద్యులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఆసుపత్రులకు  పరుగులు తీసే రోగులకు చికిత్స అందించేందుకు తగినంత సంఖ్యలో  వైద్య బృందం ఉండడం లేదు. కొందరు వైద్యులు అయితే అత్యాశతో సొంతంగా ప్రైవేటు క్లినిక్ లు తెరవడం, లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిని పక్కన పెట్టి ప్రైవేట్ ఆసుపత్రులలో ఎక్స్ట్రా గా పనిచేసి డబ్బులను  ఆర్జిస్తున్నారు. గతంలో ఇలాంటి వార్తలు చాలానే విన్నాం.  కాగా  ఈ క్రమంలో అటువంటి వారిని దారిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. కేటాయించిన సమయంలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో పనిచేయాల్సి ఉంటుందని షరతులు పెడుతూ వారిని డిమాండ్ చేస్తున్నాయి.

ఈ ఒప్పందం ప్రకారం ఆయా డాక్టర్లు తప్పనిసరిగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉంటూ రోగులకు చికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే.. ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించి ఈ ఒప్పందానికి నిరాకరించిన డాక్టర్లపై చెన్నై వైద్య విద్యాశాఖ మండిపడింది. అధిక ఆదాయం కోసం పాకులాడే వారికి  జరిమానా తప్పదని ఫైర్ అయ్యింది. అంతేకాదు తాజాగా అటువంటి వారిపై భారీ మొత్తంలో ఫైన్ విధించడం వైరల్ గా మారింది. ప్రభుత్వ ఒప్పందానికి నిరాకరించిన మొత్తం 112 మంది వైద్యులకు  రూ. 50 లక్షలు జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది వైద్య విద్యాశాఖ. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలలో  మూడేళ్ల పాటు వైద్య విద్యను పూర్తి చేసిన పిమ్మట ఆ డాక్టర్లు నిబంధనల ప్రకారం రెండేళ్లు పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో  పని చేయాల్సి ఉంటుంది, కాదని నిరాకరిస్తే అక్షరాల రూ. 50 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని లిఖితపూర్వకంగా రాయించి తీసుకుంటారు.

అయితే ఈ నేపథ్యంలో 2020-21 లో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ల లో 112 మంది నిబంధనలకు అనుగుణంగా రెండేళ్ల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసేందుకు నిరాకరించారు. దాంతో నియమాలను ఉల్లంఘించిన కారణం చేత వారి ప్రతి ఒక్కరినుంచి రూ. 50 లక్షలు జరిమానా రాబట్టాలని నిర్ణయించింది వైద్య విద్య శాఖ. ఈ మేరకు వైద్య కళాశాలల ప్రిన్స్పాళ్లను ఆదేశిస్తూ జరిమానాను వసూలు చేయమని తెలిపింది. వారు ఈ అతిక్రమనకు తెలిపే సంజాయషీలను బట్టి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు ప్రిన్సిపాళ్లు . కాగా ఆ 112 వైద్యులు ఈ అంశంపై ఎలా స్పందిస్తారో... ఏం సంజాయిషీ ఇస్తారో లేక జరిమానా చెల్లిస్తారో చూడాలి. ఈ నిర్ణయంతో ప్రభుత్వ డాక్టర్లు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: