ఇంటర్ స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్..!

NAGARJUNA NAKKA
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువు పొడిగించారు. 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశ గడువును సెప్టెంబర్ 15వరకూ పెంచుతున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. గతంలోనూ ప్రవేశ గడువును పొడిగించింది.

మరోవైపు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్ సెకండియర్ కు ప్రమోట్ అయిన విద్యార్థులకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు సిద్ధంగా ఉండాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. షెడ్యూల్, విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. విద్యాసంస్థలు ప్రారంభమైన తర్వాత పరిస్థితి అంచనా వేసి.. పరీక్షల షెడ్యూల్ ప్రకటించనున్నట్టు వెల్లడించారు. సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో నిర్వహించే వీలుంది.

ఫస్టియర్ పరీక్షలు తప్పకుండా నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా ఫస్టియర్ ఎగ్జామ్స్ రాయకుండానే.. అందరూ సెకండ్ ఇయర్ కు వెళ్లారు. ఒకవేళ కరోనా విజృంభించి మళ్లీ సెకండియర్ ఎగ్జామ్స్ రద్దు చేయాల్సి వస్తే ఫస్టియర్ మార్కుల ఆధారంగానే మార్కులు కేటాయించవచ్చని.. అందుకే పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

సెప్టెంబర్ 1నుంచి విద్యాసంస్థలు తరగతులు ప్రారంభిస్తున్నందున విద్యార్థులకు బస్ పాస్ కౌంటర్లు అందుబాటులోకి రానున్నాయి. వేసవి సెలవుల తర్వాత కొత్త బస్ పాస్ ల కోసం దరఖాస్తు చేసుకున్నట్టుగానే.. ఈ ఏడాది ఆయా విద్యాసంస్థల ధ్రువీకరణలో యథావిధిగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు చెప్పారు. విద్యాసంస్థలు ప్రారంభమయ్యే రోజు నుంచే అదనపు బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఆగస్ట్ 25న విడుదలైన ఫలితాల్లో అర్హత సాధించిన విద్యార్థులు నిర్దేశించిన ఫీజు చెల్లించి.. కౌన్సెలింగ్ స్లాట్ బుక్ చేసుకోవాలి. తర్వాత కౌన్సెలింగ్ కు హాజరుకావాల్సి ఉంటుంది. దీని ద్వారా రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో ఇంజినీరింగ్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.








మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: