వారెవా..! ఐఏఎస్‌ అకాడమీలో పాఠంగా సిరిసిల్ల విజయగాథ?

Chakravarthi Kalyan
తెలంగాణ.. నీటి కోసం.. నిధుల కోసం.. ఉద్యోగాల కోసం తండ్లాడిన నేల.. తెలంగాణ సొంత రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి.. కాళేశ్వరం నీళ్లు కొన్ని జిల్లాలకు వస్తున్నాయి.. నిధులు ఎలాగూ తెలంగాణ ఆదాయం తెలంగాణకే ఉంది.  ఆ చివరి ఉద్యోగాల మాట మాత్రం అడక్కండి.. అయితే.. ఈ నీళ్ల విషయంలో తెలంగాణ ఎంతో సాధించిందని అధికార పార్టీ చెప్పుకొస్తోంది. ఎంతగా అంటే.. ఒకప్పుడు గుక్కెడు నీటి కోసం ఎండిన నేలలో ఇప్పుడు నీళ్లు పారుతున్నాయట.

భూగర్భజలాలు కూడా గణనీయంగా పెరిగాయట. ప్రభుత్వం కొన్నేళ్ల నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న హరిత హారం కార్యక్రమంలో పచ్చదనం బాగా పెరిగి వాపస్ వెళ్లిన వానలు వెనక్కు వస్తున్నాయట. ఈ మార్పు ఎంత స్పష్టంగా ఉందంటే.. ఏకంగా సిరిసిల్ల నీటి విజయగాధ ఏకంగా ముస్సోరీలోని ఐఏఎస్ అకాడమీలో ఓ పాఠ్యాంశంగా నిలిచిందట. ఈ విషయం ఎవరో చెప్పడం కాదు.. సాక్షాత్తూ మంత్రి కేటీఆర్‌ ఓ కార్యక్రమంలో తెలిపారు.

కొన్నాళ్లుగా సిరిసిల్లలో భూగర్భజలాలు బాగా పెరిగాయట. దాదాపు 6 మీటర్ల వరకూ భూగర్భజలం పెరిగిందట. ఇలా రికార్డు స్థాయిలో భూగర్భ నీటి మట్టాలు పెరగడం అసాధారణమని.. అందుకే కొత్తగా కలెక్టర్లు కాబోయో ఐఏఎస్‌ అధికారులకు ఈ అంశాన్ని పాఠ్యాంశంగా ఎంచుకున్నారని కేటీఆర్ అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న మోడీ నినాదం ఇంకా సఫలం కాలేకపోయినా.. అదృష్టవశాత్తూ తెలంగాణలో నాలుగు రకాల విప్లవాలు చోటుచేసుకున్నాయని కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం తెలంగాణలో రెండో హరిత విప్లవం కొనసాగుతుందని.. వరి పంట విస్తారంగా సాగవుతుందని కేటీఆర్ గుర్తు చేశారు. నీలి విప్లవం ద్వారా మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని.. సాగు నీటి రంగంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందని  కేటీఆర్ గుర్తు చేశారు. టెక్నాలజీ సామాన్యుడికి ఉపయోగపడకపోతే అది నిష్ఫలం అని సీఎం కేసీఆర్ అభిప్రాయడేవారని.. ప్రస్తుతం బ్లాక్ చైన్, రోబోటిక్, క్లౌడ్, డ్రోన్ టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయని  కేటీఆర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: