రేపే విజయమ్మ తన భర్త వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్ధంతిని పురస్కరించుకుని ఒక డిన్నర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొనడానికి అందరికీ ఆహ్వానాలు పంపినట్లు తెలిసిందే. వీరిలో వైఎస్ తో పని చేసిన మంత్రులు ఇతర రాజకీయ నాయకులు, సలహాదారులు ఉండనున్నారు. అయితే ఇప్పుడు ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే విజయమ్మ ఇప్పటికే చెప్పినట్లుగా ఈ సమావేశానికి రాజకీయంగానూ లేదా ప్రభుత్వ పరంగానూ ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం ఆయనతో కలిసి పనిచేసిన వారిని ఒకసారి కలవడానికి ఏర్పాటు చేసిన గౌరవ సమావేశం మాత్రమే అని ఇన్విషన్ కార్డ్ లో మెన్షన్ చేసి ఉంది. అయితే వీటన్నింటినీ తోసిపుచ్చుతూ మీడియాలో ఒక వార్త జోరుగా ప్రచారం అవుతోంది. ఖచ్చితంగా ఈ సమావేశానికి రాజకీయాలకు సంబంధం ఉందట. ముఖ్యంగా ఈ సమావేశం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
రెండు నెలల ముందు వైఎస్ రాజకీయ వారసురాలు షర్మిల తన తండ్రి ఆశయాలను బ్రతికించుకోవడం కోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించింది. అయినప్పటికీ ఇక్కడ తగిన మద్దతు దక్కలేదనే చెప్పాలి. ఇందుకోసం వేసిన ఓ ప్రణాళిక ఈ సమావేశం అని తెలుస్తోంది. ముఖ్యంగా తెరాస పార్టీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించడమే సమావేశం యొక్క టార్గెట్ అని తెలుస్తోంది. విజయమ్మ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హాజరు కావాలని ఉద్దేశ్యంతో కొంతమందికి తానే స్వయంగా ఫోన్ చేశారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం...విజయమ్మ పిలిచిన వారిలో వైఎస్సార్ క్లోజ్ ఫ్రెండ్ కేవీపీ రామచంద్రరావు, మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, తెరాస లీడర్స్ అయిన వి సునీత లక్ష్మి రెడ్డి, కె ఆర్ సురేష్ రెడ్డి, డి శ్రీనివాస్ ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నుండి మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కోమటి వెంకట్ రెడ్డి ఇంకా మరి కొంతమంది లిస్ట్ లో ఉన్నారు. వీరందరినీ షర్మిల రాజకీయ అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కోరబోతున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ కు ఎలా అయితే మీ మద్దతు ఇచి ఒక నాయకుడిగా ఎన్నో విజయాలను సాధించడంలో అండదండగా ఉన్నారో అదే విధంగా ఆయన బిడ్డ షర్మిలకు కూడా అండగా ఉండండి అని అడగనున్నారట. అసలు ఇదంతా జరగాలంటే ముందు ఈ నాయకులంతా రేపు ఈ సమావేశానికి రావాలి. కానీ ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో ఎంతమంది వస్తారు అనేది చెప్పలేని పరిస్థితి. తెలంగాణలోని తెరాస మరియు కాంగ్రెస్ లోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులనే విజయమ్మ టార్గెట్ చేస్తోంది. వాస్తవంగా ఇది విజయమ్మ వేస్తున్న మొట్ట మొదటి రాజకీయ వ్యూహం అని చెప్పాలి. ఈ సమావేశానికి అందరూ హాజరయితే ఇది తెరాస పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఇంతకు ముందెన్నడూ ప్రత్యక్షంగా ఈమె ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించింది లేదు. అయితే దీని వెనుక ఎవరైనా ఉన్నారా లేదా అన్నది సమాచారం లేదు. మరి రేపు ఏమి జరుగుతుందో వేచి చూడక తప్పేలా లేదు.