అక్కడ పవనే కీలకం...బాబు ఏం చేస్తారో?

M N Amaleswara rao
వైసీపీ అధికారంలోకి వచ్చి అప్పుడే రెండున్నర ఏళ్ళు కావొస్తుంది. అంటే మరో రెండేళ్లలో ఏపీలో ఎన్నికల సందడి మొదలైపోతుంది. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా సరే ప్రతిపక్షాలు, వైసీపీ ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి తగ్గట్టు, కొన్ని సర్వేలు వైసీపీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల్లో మారిన రాజకీయ సమీకరణాలపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.

ఇదే సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో కీలకంగా ఉన్న అమలాపురం పార్లమెంట్‌ పరిధిలో ఈ సారి ఫలితాలు మారనున్నాయని తెలుస్తోంది. గత ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు స్థానాల్లో ఐదు వైసీపీ గెలుచుకుంది. రామచంద్రాపురం, ముమ్మిడివరం, పి. గన్నవరం, అమలాపురం, కొత్తపేట స్థానాల్లో వైసీపీ గెలవగా, రాజోలులో జనసేన, మండపేటలో టి‌డి‌పి గెలిచింది.

అయితే ఈ సారి ఇక్కడ టి‌డి‌పి, వైసీపీల మధ్య గట్టి ఫైట్ జరగడం ఖాయమని తెలుస్తోంది. అదే సమయంలో ఇక్కడ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన రాజోలులో గెలిచింది. మిగిలిన స్థానాల్లో ఓట్లు బాగానే తెచ్చుకుంది. అయితే ఈ సారి జనసేన కూడా ఇక్కడ టి‌డి‌పి-వైసీపీలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. అమలాపురం పార్లమెంట్‌లో త్రిముఖ పోరు జరుగుతుందని చెబుతున్నారు.

అదే సమయంలో టి‌డి‌పి-జనసేనలు కలిసిగాని పోటీ చేస్తే వైసీపీకి చుక్కలు కనబడటం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికల్లోనే టి‌డి‌పికి జనసేన సపోర్ట్ చేయడం వల్ల, పార్లమెంట్ పరిధిలో ఆ పార్టీకి 6 సీట్లు వచ్చాయి. వైసీపీ కేవలం ఒక్క కొత్తపేటలో మాత్రమే గెలిచింది. ఇక వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేనలు కలిస్తే దాదాపు క్లీన్‌స్వీప్ చేసేయోచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. మరి చూడాలి టి‌డి‌పి-జనసేనలు కలుస్తాయో లేదో?  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: