భారత్‌కు చెక్ పెట్టేందుకు అఫ్గాన్‌లోని ఆ ప్లేస్‌పై కన్నేసిన చైనా..?

Chakravarthi Kalyan
అఫ్గానిస్తాన్‌లో జరిగిన తాజా పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. తన ప్రత్యర్థి అమెరికా అఫ్గాన్‌ నుంచి వెళ్లిపోవడంపై ఇప్పటికే ఖుషీగా ఉన్న చైనా.. ఆ తర్వాత అఫ్గాన్‌ను అడ్డుపెట్టుకుని మరో శత్రువు ఇండియాను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు అఫ్గాన్‌లోని కీలక ప్రాంతాలను తన అదుపులోకి తెచ్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితిలోనిఅమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ బయటపెట్టారు.


నిక్కీ హేలీ ఏం చెబుతున్నారంటే.. అఫ్గానిస్థాన్‌లో కీలకమైన బగ్రామ్‌ వైమానిక స్థావరంలో చైనా తిష్ఠ వేసే అవకాశం ఉందట. ఆ తర్వాత పాకిస్తాన్‌ను ఉపయోగించుకుని భారత్‌కు వ్యతిరేకంగా చైనా పనిచేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. అందుకే జిత్తుల మారి చైనాను ఓ కంట కనిపెట్టాలని నిక్కీ హేలీ అంటున్నారు. ఈ విషయంపై భారత్‌ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఓ శుభవార్త ఏంటంటే.. తాలిబన్లు ఇప్పటి వరకూ ఇండియాకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.


అంతే కాదు.. ఇండియాతో కలసిపని చేస్తామని కొందరు తాలిబన్ల నేతలు కూడా చెప్పారు. కాబట్టి ఇప్పటికిప్పుడు అఫ్గాన్ వేదికగా ఇండియాకు వచ్చిన ముప్పేమీ లేదు. కానీ.. తాలిబన్ల మాటలు అంత సులభంగా నమ్మేవి కాదు.. దీనికితోడు అఫ్గానిస్తాన్‌ ఇప్పుడు స్వయంగా నిలబడే సత్తా లేదు. అంతర్జాతీయ సాయం లేకుండా అక్కడ ప్రభుత్వ మనుగడ సాధ్యం కాదు. అందుకే.. తాలిబన్లపై చైనా, పాక్ వంటి దేశాల ప్రభావం గణనీయంగా ఉంటుంది. ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. మనదేశ వ్యూహాన్ని రచించుకోవాల్సిన అవసరం ఉంది.


మరోవైపు అఫ్గానిస్థాన్‌ నుంచి బలగాల ఉపసంహరణ అనే తొందరపాటు నిర్ణయంతో అమెరికా మిత్రదేశాల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయింది. అంతే కాదు.. అమెరికా ఇప్పుడు తన సొంత సమస్యలతోనూ సతమతం అవుతోంది. ఇన్నాళ్లూ అఫ్గాన్ విషయంలో అమెరికాను ఫాలో అయిన ఇండియా ఇకపై సొంతంగా వ్యూహం రచించుకోవడం మంచిదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: