గులాబీ పార్టీలో పదవులు సందడి మొదలైంది. వాటిని దక్కించుకునే ప్రయత్నంలో పార్టీ శ్రేణులు తమ వంతు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. అత్యంత కీలకమైన పదవులను ఎవరికి కట్టబెట్టాలన్న అంశంపై పార్టీ అధిష్టానం ఇప్పటికే ఆరా తీసే పనిలో ఉంది. ఇందులో భాగంగా నిఘా విభాగాలను సైతం రంగంలోకి దించినట్లుగా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు జిల్లాకు చెందిన మంత్రులు, శాసన సభ్యులను కూడా నివేదికలను సమర్పించాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు వచ్చిన తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణం పై ముఖ్య నేతలతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
ప్రధానంగా రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ జిల్లాలో కీలకమైన పార్టీ అధ్యక్ష పదవిని ఎవరికి అప్పగించాలనే అంశంపై సమాలోచనలు చేయనున్నారని సమాచారం. అలాగే రాష్ట్ర కమిటీల్లో సైతం నగరం నుంచి ఎవరెవరికి అవకాశం కల్పించాలనే అంశంపై కూడా ఈ సందర్భంగా చర్చించనున్నారు. పైగా ప్రస్తుతం వేస్తున్న పలు కమిటీలు రానున్న ఎన్నికల వరకు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ పదవులకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో జిల్లా అధ్యక్ష పదవులను దక్కించుకునేందుకు నాయకుల్లో ఇప్పటినుంచి తీవ్ర స్థాయిలో పోటీ నెలకొని ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో పాతబస్తీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ శాసన సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.అలాగే శివారు ప్రాంతాల అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి. మొత్తం అసెంబ్లీ స్థానాల్లో అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులే కొనసాగుతున్నారు.
ఒకరిద్దరు ప్రతిపక్షాలకు చెందిన శాసనసభ్యులు ఉన్నప్పటికీ వారు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా లకు ఆకర్షితులై గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి జిల్లాల అధ్యక్షుల పదవుల కోసం పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ పదవులపై కన్నేసిన నేతలు జిల్లాకు చెందిన మంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. మరికొందరు ఆశావహులు పార్టీ ముఖ్యుల ఆశీస్సులు పొందే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో గులాబీ నేతలకు పదవుల జ్వరం పట్టుకుంది అని చెప్పవచ్చు.