అమెరికాలో ఆందోళన... చైనాలో ఆనందం..!

NAGARJUNA NAKKA
ఆప్ఘానిస్థాన్ లో తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటు చేయడాన్ని చైనా స్వాగతించింది. వారి రాకతో పరిస్థితులు చక్కబడతాయని పేర్కొంది. పొరుగునున్న దేశాలతో తాలిబన్లు సత్సంబంధాలు నెలకొల్పుతారని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఆప్ఘాన్ అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని తెలిపింది. మరోవైపు అమెరికా వల్లే ఆఫ్ఘాన్ లో అస్థిరత ఏర్పడిందని.. దానికి తాలిబన్లు తెరదించారని కొనియాడింది.

ఇక ఆప్ఘానిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. తాలిబన్ల మంత్రి వర్గంలో చాలామంది గతంలో తమ దళాలపై దాడులు చేసిన వ్యక్తులున్నారని పేర్కొంది. మంత్రి వర్గానికి నేతృత్వం వహిస్తున్న ముల్లా మహమ్మద్ హసన్ ఐక్యరాజ్యసమితి నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో ఉన్నట్టు తెలిపింది. మరో మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ యూఎస్ ఎఫ్ బీఐ వాంటెడ్ జాబితాలో ఉన్నట్టు పేర్కొంది.

మరోవైపు ఆఫ్ఘాన్ మహిళలు క్రీడల్లో పాల్గొనవద్దని తాలిబన్లు ఆదేశించారు. అమ్మాయిలు క్రీడలుఆడటం వల్ల బాడీ ఎక్స్ పోజ్ అవుతుందని తాలిబన్ కల్చరల్ కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వాసిఖ్ తెలిపారు. మీడియా ద్వారా ప్రపంంచంలో వారి ఫోటోలు, వీడియోలను ప్రపంచమంతా చూస్తారని.. అందుకు తాలిబన్ల ప్రభుత్వం అంగీకరించదని చెప్పారు. క్రికెట్ సహా ఎలాంటి క్రీడల్లోనూ అమ్మాయిలు ఆడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పాకిస్థాన్, తాలిబన్లకు వ్యతిరేకంగా ఆప్ఘాన్ పౌరులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు తాలిబన్లు కఠినంగా వ్యవహరిస్తున్నారు. గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు.

ఆప్ఘానిస్థాన్ పరిస్థితుల కారణంగా వివిధ దేశాల నిఘా అధిపతులతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ భేటీ అవుతున్నారు. ఇప్పటికే అమెరికా సీఐఏ చీఫ్ విలియం బర్న్స్.. రష్యా జాతీయ భద్రతా సలహాదారు నికోలయ్ పత్రుషేవ్ ను కలిశారు. ఈ ఇద్దరితో ఢిల్లీలోనే సమావేశమయ్యారు. తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు కారణంగా ఈ సమావేశాలు జరిగాయి. చూద్దాం.. భవిష్యత్ లో ఏఏ పరిణామాలు జరుగుతాయో.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: