కేసీఆర్ హెచ్చరిక : పండుగ జరుపుకోండి కానీ..!

NAGARJUNA NAKKA
ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు సుఖ సంతోషాలు ఇవ్వాలనీ.. రాష్ట్రప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. పర్యావరణ హితంగా గణనాథుడి ఉత్సవాలను జరుపుకోవాలని..ఉత్సవాలు, నిమజ్జనంలో ఎవరికీ అసౌకర్యం కలుగొద్దని ఆకాంక్షించారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందనీ.. సీఎం కేసీఆర్ చెప్పారు.

మరోవైపు గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనాన్ని హుస్సేన్ సాగర్ లో అనుమతించొద్దని.. వాటిని కేవలం కుంటల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. హుస్సేన్ సాగర్ లో ప్రత్యేకంగా రబ్బర్ డ్యామ్ ఏర్పాటు చేసి.. అందులో విగ్రహాలు నిమజ్జనం చేయాలంది. మండపాల దగ్గర ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలని ఆదేశించింది.

అంతేకాదు పర్యావరణ హిత విగ్రహాలను ప్రోత్సహించాలని సూచించింది తెలంగాణ హైకోర్టు. రాత్రి 10గంటల తర్వాత మైకులను అనుమతించొద్దని ప్రభుత్వానికి సూచించింది. ఇళ్లల్లో పెట్టుకునే మట్టి విగ్రహాలు.. బకెట్లలోనే నిమజ్జనం జరిగేలా చూడాలంటోంది. ఆన్ లైన్.. సోషల్ మీడియాల ద్వారా దర్శనాలను ప్రోత్సహించాలని చెబుతోంది. అంతేకాదు నిమజ్జనం రోజు ఉచితంగా మాస్కుల పంపిణీ చేయాలంటోంది ధర్మాసనం. రోడ్లపై రాకపోకలకు ఆటంకం కలిగేలా మండపాలు ఉండొద్దని సూచిస్తోంది. మండపాల నిర్వహకులు శానిటైజర్లు ఏర్పాటు చేయాలనీ.. భౌతిక దూరం పాటించేలా చూడాలని తెలంగాణ హైకోర్టు పండుగకు కొన్ని షరతులు విధించింది.

మరోవైపు రేపటి నుంచి చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం ప్రత్యేక అభిషేకం, సాయంత్రం పుష్ప కావళ్లతో బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. 30వ తేదీన అభిషేకం, తెప్పోత్సవంతో వేడుకలు ముగుస్తాయి. కరోనా కారణంగా ఆలయ ప్రాకారం లోపలే ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.


మొత్తానికి వినాయక చవితి పండుగ విషయంలో తెలంగాణ హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: