వివాదంలో శ్రీకాకుళం కలెక్టర్ ?
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ కేశ్ బి లఠ్కర్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన థర్మల్ పోరాటానికి కారణం అయిన సోంపేట మండలం, బీల ప్రాంతాన్ని ఆయన ఇటీవల సందర్శించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. క్షేత్ర స్థాయి పర్యటనకు తన వెంట కొందరు ఉన్నతాధికారులను సైతం తీసుకుని వెళ్లి, సందర్శించి ఈ ప్రాంతం పై ఓ నివేదిక ఇస్తానని పేర్కొంటూ పర్యావరణ సమగ్రతకు కారణం అయ్యే బీల భూములను, చిత్తడి నేలలను ఉద్దేశిస్తూ..ఇవి చిత్తడి నేలలు కావని తేల్చేశారు. తాను సందర్శనకు వచ్చినప్పుడు ఏం చూశానో అదే చెబుతానని చెప్పి కొత్త వివాదానికి తెరలేపారు. దీంతో నాటి థర్మల్ పోరాట ఉద్యమ కారులు ఆయనపై మండి పడుతున్నారు. ఏళ్లకు ఏళ్లు ఇక్కడ పర్యావరణ సమగ్రతకు సంబంధించి తాము పోరాటం చేసి, థర్మల్ రాకుండా అడ్డుకున్నామని, తరువాత సంబంధింత జీవోలు రద్దు చేయించామని, నాటి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినా సరే లెక్క చేయకుండా ప్రభుత్వ నిర్ణయం తప్పని ఎలుగెత్తి చాటామని చెబుతూ, గత పోరాటాలను స్మరిస్తున్నారు. కానీ కలెక్టర్ మాత్రం ఇందుకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉద్యమకారుల ఆగ్రహాన్ని చూస్తున్నారు. కలెక్టర్ పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ కూడా తన వాదన వినిపించారు. కొందరు వైసీపీ నేతలు కూడా పర్యావరణ సమగ్రతకు సంబంధించి ఈ ప్రాంతం ఎలా ఉంటుంది... ఏయే పక్షి జాతులు ఇక్కడ ఉంటాయి.. వీటికి ఉన్న ప్రాధాన్యం ఏంటన్నది వివరించారు. మరి! ఇక్కడ మరో మారు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పాదం కదిపితే ఉద్యమాలు తప్పవనే అంటున్నారు స్థానికులు.