న‌మో భార‌త్ : హోదాను మ‌రిచిన పెద్ద మ‌నిషి !

RATNA KISHORE
రైల్వే జోన్ అడ‌గ‌కండి? ఇవ్వ‌రు. ప్ర‌త్యేక హోదా అడ‌గ‌కండి? ఇవ్వ‌రు. రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఆంధ్రా ఎంత వెన‌క‌బ‌డుతున్నా క‌నీసం సాగునీటి ప్రాజెక్టుల మ‌ర‌మ్మ‌తుల‌కు కూడా నిధులు తెచ్చుకోలేని ద‌య‌నీయ స్థితిలో మ‌న నాయ‌క‌గణం ఉండ‌డం నిజంగానే విచార‌క‌రం. రాజ‌కీయంలో భాగంగా వీళ్లంతా పార్ల‌మెంట్ లో స్పీచులు దంచుతున్నార‌న్న‌దే వాస్త‌వం. ఇది మిన‌హా ఆంధ్రావ‌నికి ద‌క్కేది ఏమీ ఉండ‌దు. ద‌క్షిణాది రాష్ట్రాలలో అత్యంత వెనుక‌బాటును చ‌విచూస్తున్నా ద‌య చూప‌ని కేంద్రానికి ర‌థ సార‌థి మోడీ కావ‌డం పైగా ఆయ‌నొక ఛాయ్ వాలా స్థాయి నుంచి రావ‌డం, అలా వ‌చ్చి  కూడా మ‌న‌కు సాయం చేయ‌క‌పోవ‌డం ఇవ‌న్నీ కూడా విచార‌క‌రాలే!
ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవ‌డంలో కేంద్రం ఎప్పుడో దారి త‌ప్పింది.  అంతేకాదు హోదాకు విభ‌జ‌న రాష్ట్రంకు సంబంధం లేద‌న్న విధంగా మాట్లాడింది. ఇదే స‌మ‌యంలో ఎన్నో సార్లు కొంద‌రు ఎంపీలు మొర‌పెట్టుకున్నా రాష్ట్ర పురోగ‌తికి ఏ విధ‌మయిన సాయం కేంద్రం చేయ‌డం లేదు. వెనుక‌బ‌డిన ప్రాంతాల‌ను ఆదుకోవాల‌న్న ఆలోచ‌న కూడా లేదు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిధుల‌పై ఇప్ప‌టికీ కొర్రీలు వేస్తూనే ఉంది.


 రాష్ట్రంలో ఉన్న పెద్ద‌లంతా కేంద్రానికి అనుబంధంగా రాజ‌కీయం చేస్తుండ‌డంతో మోడీ ఎదుర‌న్న‌ది లేకుండా పోతోంది. హోదాతో పాటు జోన్ కూడా రాలేదు. ఏమీ ఇవ్వ‌డం లేదు. ప‌రిశ్ర‌మ‌ల రాక‌కు చేయూత ఇవ్వ లేదు. ఇంకా వ‌ర్శిటీల ఏర్పాటుకు సాయం ఇవ్వ‌లేదు. ఏం  చేయ‌క‌పోయినా కూడా జ‌గ‌న్ ఆయ‌న‌ను నిల‌దీయ‌డం లేదు. విజయ్ సాయి రెడ్డి అప్పుడ‌ప్పుడూ మీడియా ముందుకు వ‌చ్చి ఏవో నాలుగు మాటలు చెప్పి, తెర‌వెనుక బీజేపీ స్నేహంలో మునిగి తేలుతున్నారు అన్న‌ది ఓ విమ‌ర్శ‌.


ఆధునిక దేవాల‌యం పార్ల‌మెంట్ సాక్షిగా ఇచ్చిన ప్ర‌త్యేక హోదా హామీని జ‌గ‌న్ సాధించ‌లేక‌పోయారు. మోడీ ఇవ్వ‌డం అన్న‌ది ఇక జ‌ర‌గ‌ని ప‌ని. రాష్ట్రం విడిపోయాక అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా హోదా పై పోరు సాగించ‌లేకపోయింది. హోదాను ఇవ్వ‌మ‌ని, ఇంకొన్ని రాష్ట్రాలు కూడా ఇదే త‌ర‌హాలో అడుగుతున్నాయ‌ని చెప్పి ప్యాకేజీకి ఒప్పించారు. ప్యాకేజీ పేరిట విడుద‌లయిన నిధులు కూడా రాష్ట్రాభివృద్ధికి స‌హాయ ప‌డ‌లేదు. అవేవీ ఉప‌యోగ‌ప‌డ‌లేదు. రాజ‌ధాని నిర్మాణంకు సంబంధించి కొన్ని నిధులు వెచ్చించినా వాటి అమ‌లు తీరు అన్న‌ది ఇప్ప‌టికీ ఎన్నో సందేహాలకు తావిస్తునే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: