జనం కోసం పవన్ : కుల రాజకీయాలకు దూరంగా?
ప్రతి పార్టీ కులాలను నమ్ముకుని రాజకీయం చేయడంలో అర్థం ఉంటుంది. కొన్ని సార్లు అదే అనర్థాలకు దారి తీస్తోంది. టీడీపీ కానీ వైసీపీ కానీ ఓ ప్రత్యేక సామాజికవర్గం చేతి నుంచే ఎదిగాయి. వాటి కారణంగానే అవి మరికొంత రాజకీయం నడిపాయి. ఈ దశలో అవి పూర్తి స్థాయిలో వివిధ ప్రాంతాలలో బలపడ్డాయి. తమవి కాని కులాలను సైతం కొన్ని సార్లు మాత్రమే ప్రోత్సహించాయి. ఇప్పటి కీ రెడ్డి సామాజికవర్గంకు చెందిన వైసీపీలో కమ్మ సామాజిక వర్గం నేతలు ఎదగడం కష్టం అనే అంటుంటారు. అది నిజమే అని రాజ శేఖర్ రెడ్డిలా కాకుండా జగన్ కొన్ని సామాజిక వర్గాలపై అకారణ ద్వేషం ఎంచుకోవడం కానీ పెంచుకోవడం కానీ మంచిది కాదని అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. అలానే టీడీపీ కూడా ఉత్తరాంధ్రలో కొన్ని సామాజికవర్గాల ఎదుగుదలను ప్రోత్సాహించింది. ఈ క్రమంలో కాళింగ, వెలమ, కాపు సామాజిక వర్గాలు బాగా బలపడ్డాయి. ఒకటి, రెండు చోట్ల దళిత, గిరిజన వర్గాలు బలపడినా వీటితో పోలిస్తే వాటి బలం చాలదు కూడా! కానీ పవన్ తన సొంత సామాజికవర్గ నేతలకు ప్రాధాన్యం తక్కువ ఇస్తారు అనేది వాస్తవం. తన సామాజికవర్గంకు చెందిన నేతలే అయినా కొందరి పేర్లు కూడా ప్రస్తావించరు. వారికి ఎంత పేరున్నా కూడా ఆయన మాత్రం తన ప్రసంగాల్లో పెద్దగా ప్రస్తావించరు. అలానే దళిత సామాజికవర్గ నేతలకు దగ్గరగా ఉంటారన్న పేరు కూడా ఉంది. ఇతర పార్టీల కన్నా ఈయన సంబంధిత వర్గాలకు ప్రాధాన్యం ఇస్తారు. అలా అని వారిని రాజకీయ అవసరాలకు వాడుకోరు. పవన్ ఇతర పార్టీల కన్నా భిన్నంగా వ్యవహరిస్తానని ముందే చెప్పారు. ఆ విధంగానే ఆయన నడవడి ఉంటుంది. మిగతా పార్టీలలో ఉండే కులాల కుమ్ములాట కానీ ఆధిపత్య పోరు కానీ ఇక్కడ ఉండదు గాక ఉండదు. ఆయన ఒప్పుకోరు.