ఢిల్లీ సాక్షిగా జ‌గ‌న్ - కేసీఆర్ ఏం చేయ‌బోతున్నారు.. ఒక్క‌టే టెన్ష‌న్‌...!

VUYYURU SUBHASH
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లు ఆత్మీయుల‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే . ఈ ఇద్ద‌రు కూడా ఒక‌రంటే.. ఒకరిపై అభిమానం చూపించుకున్నారు. ఏపీలో జ‌గ‌న్ పాల‌న రావాల‌ని.. కే సీఆర్ కోరుకుంటే.. తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కారుకు ఇబ్బందులు ఉండ‌కూడ‌ద‌ని.. జ‌గ‌న్ కోరుకున్నారు. ఒక‌రింటికి ఒక‌రు వ‌చ్చి.. దావ‌త్‌లు చేసుకున్నారు. ఒక‌రిపై ఒక‌రు అభిమానం చూపుకున్నారు. అంతేకాదు.. జ‌గ‌న్‌కు ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌రోక్షంగా కేసీఆర్ స‌హ‌క‌రించార‌ని కూడా అంటారు. ఇక‌, సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి కేసీఆర్ విజ‌య‌వాడ‌కు వ‌చ్చి ఆశీర్వ‌దించారు.

ఇలా.. సాగిన ఈ ఇద్ద‌రి రాజకీయ‌ ప్ర‌యాణం.. కృష్ణా-గోదావ‌రి జ‌లాల సాక్షిగా.. వివాదానికి దారితీసింది. నీటి వాటాల కేటాయింపులు.. సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం.. సాగ‌ర్‌లో జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తి.. కృష్ణా రివ‌ర్ బోర్డుకు ప‌ర‌స్పర ఫిర్యాదులు ఇలా.. అనేక రూపాల్లో అనేక విష‌యాల‌పై ఇరువురు ముఖ్య‌మంత్రులు  క‌త్తులు నూరుకునే వ‌ర‌కు ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో గ‌త ఏడాది నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. దాదాపు 18 నెల‌లుగా ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు కూడా ఎదురు ప‌డింది లేదు.. ప‌ర‌స్ప‌రం మాట్లాడుకున్న‌ది కూడా లేదు. కానీ, వివాదాలు మాత్రం సాగుతున్నాయి. అంతేకాదు.. ఇంకా.. కేంద్రానికి లేఖ‌లు రాసుకుంటూ.. ఒక‌రిపై ఒక‌రు చ‌ర్య‌లు కోరుతున్నారు.

అయితే.. ఇంత‌లా పోరాడుకుంటున్న ఈ స‌మ‌యంలోనే ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు.. ఢిల్లీలో ఒకే వేదిక‌ను పంచుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఒకింత ఆశ్చ‌ర్యం అనిపించినా.. ఇది నిజం.. ఎలా అంటే.. మావోయిస్టు ప్ర‌భావిత రాష్ట్రాల్లో కేంద్ర ప్ర‌భుత్వం అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతోంది. ముఖ్యంగా గిరిజ‌ను లు మావోయిస్టుల వైపు మ‌ళ్ల‌కుండా.. ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయా ప‌థ‌కాలు ఏవిధంగా అమ‌ల‌వుతున్నాయ‌నే అంశంపై మావోయిస్టు ప్ర‌భావిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో చ‌ర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. రెడీ అయ్యారు.

ఈ క్ర‌మంలోనే ఈ నెల 26న సీఎంల స‌మావేశం ఏర్పాటు చేశారు. దీనికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులను కూడా ఆహ్వానించారు. ఈ క్ర‌మంలో తెలంగాణ  సీఎం కేసీఆర్ శుక్ర‌వార‌మే.. ఢిల్లీ ప్ర‌యాణం అవుతున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి శ‌నివారం ఉద‌యం వెళ్తార‌ని పస‌మాచారం. ఈ క్ర‌మంలో ఏపీ సీఎం జ‌గ‌న్‌, తెలంగాణ‌ సీఎం కేసీఆర్‌లు.. ఒకే వేదిక‌పై కూర్చోనున్నారు. మ‌రి.. ఆ త‌ర్వాత‌.. వీరు వ్య‌క్తిగ‌తంగా కూర్చుని .. ఏపీ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తారా?  ముహూర్తం కుదిరినా.. మ‌న‌సులు క‌లుస్తాయా?  ఢిల్లీలో ఒకే రోజు.. ఒకే వేదిక‌పై క‌లుస్తున్న నేప‌థ్యంలో ఇరువురు ముఖ్య‌మంత్రుల విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: