భారీ వర్ష సూచన.. ఎవరూ బయటకు రావొద్దు..!

NAGARJUNA NAKKA
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్ పేట్, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, పంజాగుట్ట, అమీర్ పేట్, మైత్రివనం, ఆర్టీసీ క్రాస్ రోడ్, లక్డీకపూల్, కోఠి, అబిడ్స్, నాంపల్లితో సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని.. అప్రమత్తంగా ఉండాలని సూచించిన జీహెచ్ఎంసీ.. సాయం కోసం 040-29555500 నెంబర్ ను సంప్రదించాలని కోరింది. భారీ వర్షం కారణంగా పలుచోట్ల రోడ్లు జలమయం కాగా.. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఎస్ డీఆర్ఎఫ్, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు.
మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఇది మరింత బలపడి ఒడిశా తీరానికి చేరుకునే అవకాశముందని పేర్కొంది. మరోవైపు అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 28వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా చోట్ల మోస్తరు వానలు పడతాయంది. వర్షం కారణంగా చెట్లు విరిగే ప్రమాదంతో పాటు.. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు చేరే అవకాశముండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 28వ తేదీ వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఉత్తర, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం ఈ వాయుగుండం కళింగపట్నానికి 540కి.మీ దూరంలో ఉంది. అది మరింత బలపడి తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు సాయంత్రం కళింగ పట్నం లేదా విశాఖ, గోపాల్ పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని పేర్కొంది. ఆ సమయంలో వేగంగా గాలులు వీస్తాయని వెల్లడించింది. గోపాలపురం వద్ద తీరం దాటే తుపానుకు గులాబ్ అనే పేరు ఖరారు చేసే అవకాశాలున్నాయి. తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: