ఇకపై సోలో పర్ఫామెన్స్: బీజేపీ పొత్తుపై క్లారిటీ ఇచ్చిన పవన్..
జనసేన అధికారంలోకి వస్తుంది, జనసేన మాత్రమే అధికారంలోకి వస్తుంది..
2024లో వైసీపీకి 151 సీట్లు పోయి 15 సీట్లు మాత్రమే వస్తాయని, జనసేన అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు పవన్ కల్యాణ్. అదే సమయంలో పొత్తు ధర్మాన్ని పవన్ పట్టించుకోలేదు. కనీసం బీజేపీ పేరు ఆయన ప్రస్తావించలేదు. జనసేన అధికారంలోకి వస్తుందని యథాలాపంగా అన్నారని అనుకోలేం. కచ్చితంగా జనసేన పేరు మాత్రమే చెప్పాలనుకున్నారు, చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో ఎక్కడా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, బీజేపీని కానీ పొగిడే ప్రయత్నం చేయలేదు పవన్ కల్యాణ్. అసలు బీజేపీ ప్రస్తావనే లేకుండా జనసేన విస్తృత స్థాయి సమావేశం ముగిసింది.
బీజేపీతో జనసేన పొత్తుపై చాలా కాలంగా అనుమానాలు నెలకొన్నాయి. అసలు బీజేపీతో కలవడం వల్ల జనసేనకు కలిగిన ప్రయోజనం ఏంటనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. తిరుపతి ఎన్నికల వరకు జనసేన త్యాగాలకే పరిమితం అయింది. చివరకు పరిషత్ ఎన్నికల్లో కూడా జనసేనకు చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు వచ్చాయి కానీ, జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ మాత్రం నిరాశ పరిచింది. ఇటీవల పరిషత్ ఎన్నికలపై రివ్యూ జరిపిన జనసేనాని.. బీజేపీకి ఇచ్చిన సీట్ల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో జనసేన మరిన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేసి ఉంటే, ఎక్కువ స్థానాలు గెలిచేవారమని కూడా అన్నారు. దాదాపుగా బీజేపీతో జనసేనకు ఉపయోగం ఉందా లేదా అనే విషయంపై పవన్ ఓ క్లారిటీకి వచ్చేశారని తెలుస్తోంది. ఈ క్లారిటీతోనే ఆయన 2024 ఎన్నికలను ఎదుర్కోడానికి సిద్ధమయ్యారు. అయితే విమర్శలు, ప్రతి విమర్శలు లేకుండా స్మూత్ గా బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలనుకుంటోంది జనసేన.