చివరకు వాటిని కూడా తాకట్టు పెట్టేస్తున్న జగన్..?
జగన్ సర్కారు నిధుల సమీకరణలో అప్పుల సేకరణ మొదటి అంశంగా ఉంటోంది. ఇప్పటికే.. ఆబ్కారీ షాపులపై వచ్చే ఆదాయాన్ని కూడా చూపించి అప్పులు తెచ్చుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి పనే చేస్తోంది జగన్ సర్కారు. తాజాగా రహదారులు, భవనాల శాఖకు చెందిన ఆస్తుల తనఖాకు రెడీ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని రహదారులు భవనాల శాఖ స్థలాలు, అతిథి గృహాల భవనాలను ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు బదలాయించింది. ఈ మేరకు ఓ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3వేల 787 కోట్ల విలువైన ఆస్తులు కుదువ పెట్టుకునేందుకు జగన్ సర్కారుకు అవకాశం దక్కింది. ఈ ఆస్తులను తనఖా పెట్టి అదనపు రుణాలను ఆర్డీసీ ద్వారా సేకరించాలన్నది జగన్ సర్కారు వ్యూహంగా చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ అండ్ బికి ఉన్న 574 ఎకరాల భూమి, 3 లక్షల 31 వేల చదరపు అడుగుల కార్యాలయం, నివాస స్థలాలున్న భవనాలను తనఖా పెట్టాలని ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఇలా తనఖా పెడుతున్న ఆస్తుల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో రూ. 1266 కోట్ల విలువైన ఆస్తులను రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు బదలాయించారు. అంతే కాదు.. ఆర్డీసీ నుంచి మరిన్ని రుణాలు తీసుకుంటారని టాక్ వినిపిస్తోంది. అందు కోసం వివిధ జిల్లాల్లోని రూ. 3393.65 కోట్ల విలువైన 574.37 ఎకరాలను ఆర్డీసీకి బదలాయించారు. రూ. 392.50 కోట్ల విలువైన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లు, భవనాలను రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌కు బదలాయించారు.