రాజకీయాల్లో అందునా.. ఇప్పుడు ఏపీలో ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఒకటి రెండు సార్లు ఏవిషయం లో నైనా ఆలోచించాల్సిందే. ఆచితూచి అడుగులు వేయాల్సిందే. అయితే.. అన్ని విషయాల్లోనూ ఇలానే చేస్తాను అంటే.. చేతులు కాలిపోయే వరకు పరిస్థితిని తెచ్చుకోవడమేనని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా ఏ విషయాన్నీ ఒక పట్టాన తేల్చరని.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు పేరుంది. ప్రతి విషయాన్నీ ఆయన ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మంచిదే. అయితే.. మాజీ మంత్రి.. జవహర్ విషయంలోనూ ఇలా చేయడం సరికాదనే సూచనలు వస్తున్నాయి.
మాదిగ సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా.. మంచి వాయిస్ ఉన్న నేతగా పేరున్న కేఎస్ జవహర్ విషయంలో చంద్రబాబు ఇలా ఆచి తూచి ఆలోచిస్తుండడం సరికాదని పార్టీలోని కొన్ని వర్గాల్లో చర్చ నడుస్తోంది. 2014 ఎన్నికలకు ముందు టీచర్‌గా ఉన్న జవహర్‌ను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు చంద్రబాబు. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం.. కొవ్వూరును కేటాయించారు. ఇక్కడ నుంచి జవహర్ విజయం దక్కించుకున్నారు. అనంతరం .. ఆయనకు ఎక్సైజ్ మంత్ర పదవిని 2017లో ఇచ్చారు. ఒకవైపు మంత్రిగా.. మరోవైపు.. పార్టీ నాయకుడిగా.. జవహర్ ఆసాంతం కష్టపడ్డారు.
అయితే.. కొవ్వూరులోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు.. జవహర్‌పై కత్తికట్టినట్టు వ్యవ హరించారు. తమ పనులు చేసిపెట్టడం లేదని.. ఎదురు తిరిగారు. ఇక, వీరి నిరసనలు, ధర్నాలతో.. ఆయ నను కృష్ణాజిల్లా తిరువూరుకు పంపించారు. వాస్తవానికి జవహర్ వద్దు మొర్రో అన్నప్పటికీ.. వినిపించుకో కుండానే.. ఆయనను తిరువూరుకు పంపారు. అయినప్పటికీ.. అక్కడ ఆయన సత్తా చూపించారు. పార్టీ పరంగా ఆయన విజయం సాధించలేక పోయినా.. మహా మహా నాయకులు ఓడిపోయి.. సాధించిన ఓట్ల కంటే.. ఎక్కువగానే జవహర్ సాధించారు. కేవలం జవహర్ 8 వేల మెజారిటీతో ఓడిపోయారు.
పార్టీ తరఫున ఓడిపోయినా.. జవహర్ మాత్రం వాయిస్ వినిపించడంలోను.. పార్టీ కార్యక్రమాలు నిర్వహిం చడంలోను.. జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించడంలోనూ.. ముందున్నారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోతున్నారు. పార్టీకి అండగా ఉంటున్నారు. మీడియాలో ఆయన వైసీపీపై ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనను రాజమహేంద్రవరం పార్లమెంటరీ పార్టీ చీఫ్‌గా నియమించారు. కానీ, ఆయన మాత్రం తిరిగి తనను కొవ్వూరుకు ఇంచార్జ్‌ను చేయాలని కోరుతున్నారు. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు తేల్చకపోవడం గమనార్హం. ఇక, గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన.. వంగలపూడి అనిత.. తిరిగి తన పాత నియోజకవర్గం పాయకరావుపేటకు వెళ్లిపోయారు. దీంతో కొవ్వూరులో ఇప్పుడు పార్టీని నడిపించేందుకు ఎవరూ లేరు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గా లపైనా కసరత్తు చేస్తున్న చంద్రబాబు.. ఒక్క కొవ్వూరు విషయానికి వస్తే.. మాత్రం మౌనంగా ఉంటున్నా రు. నిన్నటికి నిన్న ఆరు నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించారు. అయితే కొవ్వూరు విషయంలో మరి ఇలా నాన్చి నాన్చి.. ఎన్నికలకు ముందు.. ఆయనకు ఇక్కడ బాధ్యతలు అప్పగిస్తే.. ప్రయోజనం ఏంటి? అంటున్నారు పరిశీలకులు. ఎన్నికలకు ముందుగానే ఇక్కడ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే.. బెటర్ అని అంటున్నారు.
మాదిగ సామాజిక వర్గంలో బలమైన వాయిస్ వినిపించే నాయకులు.. ఎవరూ లేని ప్రస్తుత సమయంలో జవహర్ వంటి నాయకులను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం పార్టీకి ఉందనే సూచనలు కూడా వస్తున్నాయి. మరి నాన్చకుండా.. ఆయనకు త్వరలోనే కొవ్వూరు బాధ్యతలు అప్పగిస్తే.. ఖచ్చితంగా ఆయన గెలిచి చూపిస్తారని అంటున్నారు పరిశీలకులు. దీనినే ఎన్నికల ముందు వరకు నాన్చితే అటు కొవ్వూరులో గత ఎన్నికలకు ముందు ఎలా గ్రూపుల గోలతో పార్టీ దెబ్బతిందో ఈ సారి కూడా అదే పొరపాటు రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.