విష్ణు విజయానికి ముద్దుగుమ్మల రాక ఎంతో కలిసి వచ్చింది. వారొచ్చాకే ఓటింగ్ కు ఓ పాజిటివ్ వైబ్ వచ్చింది. జెనీలియా మొదలుకుని అనుపమా పరమేశ్వరన్ దాకా అంతా ఎక్కడెక్కడివారో ఇక్కడికి వచ్చి, మా ఓటింగ్ లో పాల్గొని, బాధ్యత నిర్వర్తించి వెళ్లడంతో లోకల్ గా ఉన్న నటీనటులంతా ఆఖరి నిమిషంలో అయినా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఆలోచనకు వచ్చేరు.
దీంతో ఆఖరి నిమిషంలో 120 ఓట్లు పోలయ్యాయి. మొత్తం పోలయిన 605 ఓట్లలో ఇవి చాలా కీలకం అయ్యాయి. అదేవిధంగా చెల్లని ఓట్లు 44 ఉన్నాయి. ఇవి కూడా కొందరు కావాలనే చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. నోటానే ఇలా వాడుకున్నారని జర్నలిస్టు ప్రభు చెప్పారు. ఇవి కాకుండా మరికొన్ని విశ్లేషణలూ వెలుగు చూశాయి. జయప్రద లాంటి సీనియర్లు ఢిల్లీ నుంచి రావడంతో కొందరు లోకల్ నటులకు బుద్ధి వచ్చిందని ఇదీ ఒకందుకు మంచిదే అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇండస్ట్రీ పై మోహన్ బాబుకు పెద్దగా పట్టులేదని, ఆయన ఆవేశం కారణంగా శత్రువులే ఎక్కువని తరుచూ అనేవారికి, విమర్శించే వారికి ఈ ఎన్నికలు ఓ గుణపాఠం అయ్యాయి అన్నది కూడా వాస్తవమే!
ముఖ్యంగా నందమూరి కుటుంబాలు, మెగా కుటుంబాలు అన్నీ కూడా ఓ విధంగా మోహన్ బాబుకు సన్నిహితంగానే ఉంటాయి అన్నది బహిరంగ రహస్యమేనని తేలిపోయింది. బయటకు వీళ్లు అరిచి గోల చేసినా, అంతిమంగా ఎవరి ప్రయోజనాలకూ భంగం వాటిల్లకుండా కలిసే పనిచేస్తారని, సినిమా వ్యాపారంలోనూ నిర్మాణంలోనూ ఇదే పద్ధతి పాటిస్తారని, ఇదే పద్ధతిని ప్రచార సూత్రాలకూ వర్తింపజేస్తున్నారు. దీంతో ఇండస్ట్రీ కుటుంబాలు బయటకు బాగా నటిస్తూ లోపల ఎవరి పని వారు ప్రశాంతంగా చేసుకుని పోతున్నారు. ఆహా లాంటి ఓటీటీ మాధ్యమాలను సక్సెస్ చేయడంలో అటు నందమూరి ఇటు అక్కినేని కుటుంబాలు బాగానే పని చేశాయి. మరి ఎక్కడ వైరం ఉందని ..సో! ఇదంతా నాటకం.