థర్మల్ పవర్ ప్లాంట్లకు తాళాలు.. చీకట్లో మగ్గాల్సిందేనా..?
బొగ్గు కొరత వల్ల మహారాష్ట్రలోని 13థర్మల్ పవర్ ప్లాంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. విద్యుత్ వినియోగంలో పొదుపు పాటించాలని ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రజలను కోరింది. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు, సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 10గంటల వరకు విద్యుత్ ను ఆచితూచి వాడుకోవాలని కోరింది. మరో పది రోజుల వరకు విద్యుత్ కోతలు ఉండొచ్చని చెప్పింది. ప్రస్తుత బొగ్గు కొరతను అధిగమించేందుకు ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొంది.
ఇక దేశంలో బొగ్గు కొరత వల్ల విద్యుత్ సంక్షోభం తలెత్తుతుందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ స్పందించారు. అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని.. గెయిల్, డిస్కంల మధ్య సమాచార లోపం వల్లే ఇలాంటివి ఏర్పడినట్టు తెలిపారు. దేశంలో నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని.. అవసరమైన వారికి సరఫరా చేస్తామని చెప్పారు. విద్యుత్ కేంద్రాలకు అవసరమైన గ్యాస్ అందించాలని గెయిల్ సీఎండీకి ఆదేశిలిచ్చామన్నారు.
అంతేకాదు దేశంలో థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా పెంచుతామని కేంద్రం స్పష్టం చేసింది. తద్వారా విద్యుత్ సంక్షోభాన్ని తప్పిస్తామని తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు రోజుకు 1.6మిలియన్ టన్నులు సరఫరాచేస్తామని హామీ ఇచ్చింది. ఢిల్లీ, పంజాబ్ సహా వివిధ రాష్ట్రాల్లో బొగ్గు నిల్వలు అడుగంటుతున్నాయి. ఈ కారణంగా బొగ్గు సరఫరా పెంచుతున్నట్టు కేంద్రం తెలిపింది. చూద్దాం.. పరిస్థితులు మెరుగుపడతాయో లేదో.