తండ్రి పెద్ద పదవిలో ఉంటే, మామ రాజకీయంగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే సమయం అనుకున్నారో ఏమో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట ఆ యువ మహిళా నేత. నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకున్నట్లుగా కాషాయ శిబిరంలో టాక్. తెలంగాణ బిజెపి లో సీనియర్ నేతల వారసులు క్రమంగా తెరపైకి వస్తున్నారా..? హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయ లక్ష్మి ఆ జాబితాలో ఉన్నారా? దత్తాత్రేయ ఇంటి నుంచి ఇప్పటి వరకు రాజకీయ వారసులు ఎవరూ లేరు. ఇప్పుడు విజయలక్ష్మి కొన్ని అంశాలలో యాక్టివ్ గా పాటిస్పేట్ చేస్తున్నారు. దీంతో ఆమెను వారసురాలిగా ప్రమోట్ చేస్తూన్నారా అనే చర్చ సాగుతోంది. ఏటా దసరాకు దత్తాత్రేయ నిర్వహించే అలాయి బలాయి కార్యక్రమం పెద్ద ఫేమస్. గతేడాది కరోనా వల్ల నిర్వహించ లేకపోయినా ఈ ఏడాది జలవిహార్ లో అలాయి బలాయి కి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కార్యక్రమ నిర్వహణ అంతా దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మే చూస్తున్నారు. ఆహ్వానాలు మొదలుకొని ఏర్పాట్లు మొత్తం విజయలక్ష్మి చెప్పినట్లే జరుగుతున్నాయట. ఒక్క అలాయి బలాయే కాకుండా బిజెపి కార్యక్రమాల్లోనూ విజయలక్ష్మి పాత్ర పెరుగుతోంది. పార్టీ తరపున ప్రచార కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. ఇటీవల తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రలోనూ సందడి చేశారు. ఇవన్నీ చూసిన కమలనాథులు దత్తాత్రేయ కుమార్తె రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని అనుకుంటున్నట్టు భావిస్తున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోరితే మాత్రం విజయలక్ష్మి ఎక్కడ నుండి పోటీ చేస్తారన్నది ప్రశ్న. గతంలో దత్తాత్రేయ ఎంపీగా ఉన్న సికింద్రాబాద్ ఖాళీ లేదు. అక్కడ గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక విజయలక్ష్మి మామ జనార్దన్ రెడ్డి కూడా బిజెపిలో ఉన్నారు.
ఆయన గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఒకవేళ లోక్ సభకు పోటీ చేయాలని విజయలక్ష్మి భావిస్తే చేవెళ్లను ఎంపిక చేసుకోవచ్చునని దీనికి మామ జనార్దన్ రెడ్డి నుంచి పెద్దగా అభ్యంతరం వ్యక్తం కాదని పార్టీ నేతలు అనుకుంటున్నారట. కోడలికి బిజెపి టికెట్ ఇస్తే జనార్దన్ రెడ్డి కాదన లేనని ఒక వాదన.కాదు అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటే మాత్రం జూబ్లీహిల్స్ టికెట్ అడగచ్చనే టాక్. మరి దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆలోచన ఏంటో చూడాలి.