నేడే టీఆర్ఎస్‌ ప్లీన‌రీ..పెళ్లి సంద‌డిలా గులాబీ స‌వ్వ‌డి..!

N ANJANEYULU
తెలంగాణ రాష్ట్ర స‌మితిని స్థాపించి 20 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా హైద‌రాబాద్ న‌గ‌రంలోని మాదాపూర్ హెచ్ఐసీసీ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశానికి అట్ట‌హాసంగా భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు.  వేదికపై  దాదాపుగా మూడువందల మంది కూర్చునే విధంగా ఏర్పాట్ల‌ను  చేప‌ట్టారు. 29 ర‌కాల వంట‌ల‌తో భోజ‌నం ఏర్పాట్లు చేస్తున్నారు వంట మాస్ట‌ర్లు.  అదేవిధంగా ఫోటో ఎగ్జిబిష‌న్‌,  ప్రతినిధుల రిస్ట్రేషన్  కౌంటర్ల‌ను  ఏర్పాటు చేశారు. ప్లీనరీ నిర్వ‌హిస్తున్న వేదిక‌ చుట్టూ స‌మీపంలో  పెద్ద ఎత్తున ప్లెక్సీలు, కటౌట్లు  క‌నిపిస్తున్నాయి.
టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించి ద్విద‌శాబ్ద కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలను  అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్నో ఆటుపోట్ల‌ను తట్టుకొని అలుపెరుగని పోరాటంతో తన ప్రస్థానాన్ని గులాబీ సైన్యం ముందుకు సాగించింది.  20 వసంతాల కాలం సుదీర్ఘ ప్రయాణంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఉద్యమ పంథాను ఎంచుకున్న‌ది.  టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ నాయకత్వంలో ఉన్నత లక్ష్యాలతో ముందుకు కొన‌సాగింది.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్ర‌జ‌ల సాకారం నెర‌వేర్చింది. తెలంగాణ‌లో టీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఎన్నో విజయాలను సొంతం చేసుకుని, ప్రజలకు ప‌లు సంక్షేమ ఫలాలను అందించింది. ఈ నేప‌థ్యంలోనే పార్టీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వ‌హిస్తోంది. రాష్ట్రంలోని న‌లుమూలలు నుంచి దాదాపు అన్ని ప్రాంతాల నుండి ప్లీనరీకి వచ్చే పార్టీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు  గులాబీ సైనికులు ఉత్సాహంగా ఉన్నారు.  ప్లీన‌రీ స‌మావేశ ఏర్పాట్లు పెళ్లి సంద‌డిలా ఉన్నాయ‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.  
నగరంలోని ఉన్న కూడ‌ళ్లు, వీధులన్నీ గులాబీ మ‌యంగా మారిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్‌ మహానగరం పింక్‌ సిటీని తలపిస్తూ క‌నిపిస్తున్న‌ది. 20 ఏళ్ల‌లో సాధించిన విజయాలను రాష్ట్ర ప్రజలకు వివరించనున్నది. ఈవేదిక ద్వారా టీఆర్‌ఎస్‌ అధినేత పార్టీ ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పార్టీ కార్యకర్తలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట‌ల వ‌ర‌కు మొదటి సెష‌న్ ఉంటుంది. మ‌ధ్యాహ్నం 1 గంట‌ల నుంచి 2 గంట‌ల వ‌ర‌కు లంచ్ ఉంటుంది. లంచ్ కోసం 29 ర‌కాల వంట‌ల‌తో భోజ‌న ఏర్పాట్లు ఇప్ప‌టికే మొద‌లు పెట్టారు. అదేవిధంగా మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు రెండో సెష‌న్ నిర్వ‌హించ‌నున్నారు. తొలుత సీఎం కేసీఆర్ అమ‌ర‌వీరుల‌కు నివాళులర్పించ‌నున్నారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల వేసి.. పార్టీ జెండాను ఆవిష్క‌రించ‌నున్నారు. పార్టీ అధ్య‌క్షుడి ఎన్నిక ప్ర‌క‌టిస్తారు. అనంత‌రం కేసీఆర్ ప్ర‌సంగం చేస్తారు. కేంద్ర‌, రాష్ట్రస్థాయి అంశాల‌పై 7 తీర్మాణాలు చేయ‌నున్నారు. ఒక్కో తీర్మాణాన్ని ఒక్కోనేత ప్ర‌క‌టిస్తారు. ప్ర‌తినిధుల న‌మోదు కోసం 35 కౌంట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. దాదాపు 6 వేల మంది ప్ర‌తినిధులు హాజ‌రుకానున్నారు. సైబరాబాద్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో పోలీసు బందోబస్త్ ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తున్నారు. ట్రాఫిక్ స‌మ‌స్య‌లు త‌లెత్తకుండా వేదిక చుట్టూ 8 కేంద్రాల్లో పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: