నోటుకు ఓటు..ఆలోచించు ఓటరా.. ఈ సొమ్మంతా ఎక్కడిది..!

MOHAN BABU
 హుజురాబాద్ ఉప ఎన్నిక పుణ్యమా అని దేశమంతా  నియోజకవర్గం మీదనే దృష్టిసారించింది. ఇంతలా హుజురాబాద్ నియోజకవర్గం లో ఏముంది. అక్కడ  పోటీ చేసే వ్యక్తులు మనలాంటి మనుషులు కాదా.. అన్ని ఎన్నికల లాగే  ఈ హుజురాబాద్  ఎన్నికల్లో కూడా  ఓట్ల ద్వారానే ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు కదా..! మరి ఎందుకు అంతలా మార్మోగిపోతోంది.. అంత కాస్ట్లీ ఎలక్షన్ గా ఎందుకు మారిపోయింది. రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్య విలువలను మరిచి ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఎలా పంచగలుగుతున్నారు.. ఓట్లు అంటే నోట్లకు అమ్ముకోవడం అనే భావనను ప్రజలలో కలిగిస్తున్నారా. ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగిస్తూ ప్రలోభాలకు తెరలేపి ప్రజలను మోసం చేస్తూ డబ్బు ఎర వేసి, అధికారం చేజిక్కించుకొని  ఆ తర్వాత ఖర్చు చేసిన డబ్బుల కంటే 100 రేట్లు ఎలా సంపాదించాలో ఆ దారిలోనే నేతలు వెళ్తున్నారా..?


 ప్రజలారా మెదడుకు పదును పెట్టండి. ఇన్ని కోట్ల డబ్బులు ఈ నాయకులు ఎక్కడినుంచి సంపాదించారు ఆలోచించాలి ఓటర్ మిత్రమా. ఇవ్వగానే తీసుకోవడం కాదు. అసలు వారు డబ్బు ఎందుకు ఇస్తున్నారు. ఇంత డబ్బు తీసుకుని నేను ఓటు వేస్తే రేపు ఏదైనా పని పడితే  ఆ నాయకుడిని నేను ఏ విధంగా అడగగలను. ఆలోచిస్తున్నావా ఓటర్ మిత్రమా.. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో  5 వేల నుంచి 10 వేల రూపాయలకు తలొగ్గి తుపాకీ కంటే బలమైన ఓటును  అమ్ముకుంటున్నారు. నీ ఓటు విలువ నీకు తెలుసా.. తెలియదా..? ఏ నేత వచ్చినా డబ్బులు నాకు రాలేదు అని అడుగుతున్నారు కానీ, నా కొడుకుకి ఉద్యోగం రాలేదు, నాకు ఇల్లు రాలేదు, ఇతర పనులు కాలేదు  అని ఎప్పుడైనా నిలదీస్తున్నారా.. నీకు నువ్వే ఆలోచించుకో మిత్రమా. ఓటును అమ్ముకోకు నీ ఓటుతో నీకు ఏ నాయకుడైతే పని చేస్తాడో ఆ నాయకున్ని ఎన్నుకో.. ఆయనతో పని చేయించుకో.. పని చేయకుంటే బజార్లో నిలబెట్టి అడుగు.. అది నీకు ఉన్న హక్కు. ప్రజాస్వామ్యంలో ఓటుకు డబ్బు ఇచ్చే హక్కు గాని, తీసుకునే హక్కు గాని నీకు లేదు. వారు ఎందుకు ఇస్తున్నారో, మనల్ని ఏ విధంగా మారుస్తున్నారో వారు ఇచ్చే డబ్బుతో మనం ఎన్ని రోజులు బతుకుతున్నామో ఆలోచించుకో ఓటర్ మహాశయా.. ఇప్పుడు ఓటుకి ఎంత ధర పెరిగితే..ఆ తర్వాత పెరిగే ప్రతి ధరకు మనం ప్రతిరోజు బాధ్యులమవుతాం.


ఉదాహరణకు  నువ్వు తీసుకునే 5000 రూపాయలు  5 ఏళ్లకు లెక్కకడితే ఒక రోజుకు  మనకు వారిస్తున్నా డబ్బు మూడు రూపాయలు. కానీ వారు పెంచిన ధరలతో ఒక మధ్య తరగతి కుటుంబం  ప్రతిరోజు పెడుతున్న ఖర్చు ఒక   రోజుకు దాదాపు  300 రూపాయలు వరకు ఉంటుంది. అంటే నీకు మూడు రూపాయలు ఇచ్చి నీ నుంచి 300 రూపాయలను పెంచిన ధరలతో ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. అంటే ఇప్పుడు ఈ డబ్బు తీసుకున్నావు గనకే ధరలు పెరిగినప్పుడు కనీసం ఆ నాయకుడిని ప్రశ్నించ లేక పోతున్నావు. తప్పు ఎవరిదీ ఆలోచించు.. నోటుకు ఓటు అమ్ముకోకు ఓటరా.. ఒక్క క్షణం ఆలోచించు.. నీ భవిష్యత్తు ఏంటో అర్థమవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: