బద్వేల్ పోలింగ్ 75 శాతం దాటితే.. ఎవరికి ప్లస్..?
నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉండగా.. 281 పోలింగ్ కేంద్రాలు, 221 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు గుర్తించారు. ఇక, ఎన్నికల ప్రక్రియను గమనిస్తే.. ఎన్నికల బరిలో మొత్తం 15 మంది అభ్యర్తులు ఉన్నారు. బీజేపీ ఈ ఉప పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధానంగా టీడీపీ ఇక్కడ పోటీ లో లేక పోవడంతో పాటు.. తమ మిత్రపక్షం జనసేన కూడా పోలింగ్‌కు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఇక్కడ ఉప పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రచారం సహా.. ఎన్నికల వ్యూహం వరకు పక్కా ప్లాన్ వేసుకుంది.
అయితే.. ఇక్కడ పోలింగ్ శాతం పెరిగితే.. ఏంటి? తగ్గితే ఏంటి? అనే చర్చ జరుగుతోంది. ఉదయం మంద కొడిగా ప్రారంభమైన.. పోలింగ్ తర్వాత పుంజుకుంది. ఉదయం 11.00 గంటల వరకు 20.89 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో అంచనాలు మారతాయని.. ఇక్కడ అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవని అనుకు న్నారు. కానీ, మధ్యాహ్నం 1.00గంట సమయానికి పోలింగ్ శాతం... 35.47కు చేరింది. దీంతో సాయంత్రం నాటికి బద్వేల్ ఉప పోరు పోలింగ్ 75 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసుకుంటున్నారు. ఎందుకంటే.. రెండు గంటల పాటు పోలింగ్ సమయం పెంచడం.. వంటి కారణాలతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది.
మరి ఇదే జరిగితే.. ఎవరికి లాభం.. అంటే.. సాధారణంగా.. ఓట్లు ఎప్పుడు పెరిగినా.. అది అధికార పక్షానికి మైనస్ అనే మాట వినిపిస్తూ.. ఉంటుంది. కానీ.. ఏపీలో పరిస్థితిలు, అంచనాలు కూడా మారిపోయాయి. ఓటింగ్ పెరుగుతుంటే.. అది అధికార పార్టీకి.. మేలు చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. పైగా.. ఇప్పుడు బద్వేల్లో ప్రధాన పార్టీలు పోటీకి దూరంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ వైసీపీకి లక్ష మెజారిటీ దక్కుతుందనే అంచనాలు కనిపిస్తున్నాయని.. వైసీపీ నాయకులు భరోసా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.