అమిత్ షాతో భేటీ కి ఏపీ లోని రెండు పార్టీల నేతలు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. వచ్చే నెలలోనే అమిత్ షా ఏపీకి రానుండడంతో అక్కడే భేటీలు సాగుతాయని టాక్ వినిపిస్తోంది. దీంతో ఎవరెవరు భేటీ అవుతారు, ఎవరెవరికి ఛాన్స్ దక్కుతుంది అనేది కీలకంగా మారిందట.కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ 14న ఏపీ పర్యటనకు రానున్నారు. ప్రస్తుతం ఏపీ లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా పర్యటన ఆసక్తికరంగా మారుతుంది. తిరుపతి లో వచ్చే నెల 14న 29వ సధరన్ జోనల్ కమిషన్ నిర్వహించనున్నారు. ఈ సమావేశం గతంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఈ సమయంలోనే జరగాల్సి ఉంది. కానీ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఈసారి జరిగే సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి జగన్ పైన టిడిపి నేత పట్టాభి వ్యాఖ్యలు ఆ తర్వాత టిడిపి కార్యాలయంపై దాడి ఘటన తో కేంద్రం వద్దకు రెండు పార్టీల నేతల ఫిర్యాదులు పోటాపోటీగా చేసుకుంటున్నాయి. పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన వెంటనే టిడిపి అధినేత చంద్రబాబు నేరుగా అమిత్ షా కి ఫోన్ చేసి చెప్పారు. పార్టీ కార్యాలయాలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. తాజాగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కేంద్ర హోం మంత్రిని కలిసి ఇవే అంశాల పై ఫిర్యాదు చేశారు. తిరుపతి లో అధికార కార్యక్రమానికి పాల్గొనేందుకు వస్తున్న అమిత్ షా టూర్ లో భాగంగా ఏపీలో రాజకీయ అంశాలపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఏపీలో బీజేపీ జనసేన పొత్తు వ్యవహారంలో చోటుచేసుకుంటున్న పరిణామాల పైన చర్చించే చాన్స్ కనిపిస్తోంది. గతంలో అమిత్ షా ఇదే సమావేశం కోసం తిరుపతి వచ్చిన సమయంలో కలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావించారు. అయితే సమావేశం రద్దు కావడంతో కలవలేదు. పవన్ కళ్యాణ్ కూడా చాలాకాలంగా ఢిల్లీకి వెళ్లి అమిత్ షా ను కలవాలని ఏపీలో అనేక సమస్యల గురించి చెప్పాలని చూస్తున్నారట. ఇప్పుడు ఆయనకు మంచి చాన్స్ వచ్చేటట్లు ఉంది. ఇలా ఏపీ కి చెందిన ప్రధాన పార్టీ నేతలంతా కూడా అమిత్ షాతో భేటీ ల మీద భేటీలు వేస్తారన్న సమాచారమయితే సాగుతోంది.
మరి అతి కీలకమైన మీటింగులకు, అది కూడా అధికారిక హోదాలో హాజరవుతున్న అమిత్ షా ఏపీ రాజకీయ నేతలకు అపాయింట్మెంట్ ఇచ్చే తీరిక ఉంటుందా? అసలు ఆయనకు ఆ కోరిక ఉందా అనే చర్చ సాగుతోంది.ఏదేమైనా ఏపీకి చాలా కాలం తర్వాత అమిత్ షా రావడం బలమైన ప్రాంతీయ పార్టీల మధ్య వార్ సాగుతున్న నేపథ్యంలో టూర్ చేయడం చూస్తే మాత్రం కచ్చితంగా ఏపీ బీజేపీ కి దిశానిర్దేశం చేసే విధంగానే ఉంటుందని అంటున్నారు.