కేసీఆర్ vs ఈటల : ఓట్లు.. నోట్లు గెలిచేదెవరు..?
సాయంత్రం ఏడు గంటల వరకు సాగిన ఎన్నికలో ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. ఏడు గంటల లోపు లైన్ ఉన్న వారిని ఓటు వేసేందుకు అనుమతిచ్చారు అధికారులు దీంతో 86.33 శాతం ఓటింగ్ నమోదయింది. ఎంతో బలమైన ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేస్తే, మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దింపారు. అయితే, పోటీలో మొత్తం 36 మంది అభ్యర్థులన్నారు. కానీ , అసలైన పోటీ మాత్రం టీఆర్ఎస్, బీజేపీ ల మధ్యే ఉంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2, 37,000 ఓట్లు ఉన్నాయి. ఇందులో 86.33 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి సకల విధాలుగా టీఆర్ఎస్ మరియు బీజేపీ ప్రయత్నాలు చేశాయి. అయితే, ఇందులో భాగంగానే టీఆర్ఎస్ దళితబంధు తీసుకురావడం, అలాగే ఒక ఓటుకు దాదాపు 20 వేల వరకు ఇవ్వడం లాంటివి చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, ప్రజల ఓటు విలువ వారిచ్చే డబ్బుపై ఆధారపడి ఉంటుందా అనే అనుమానం కలుగుతోంది. ఈ ఎన్నికల వ్యవహారం అంతా ఇరు పార్టీలకు చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికైతే ఎవరికి వారు విజయం మాది అంటే మాదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎం డబ్బాల్లో వారి భవితవ్యం ఉంది. అక్టోబర్ 2న ఫలితాలు ఏ విధంగా వస్తాయో చూడాలి.