బీజేపీతో బాబు...ఆ ఫోన్‌తోనే మారినట్లు ఉంది..!
అక్కడ నుంచి ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే...ఆ తర్వాత బీజేపీ, చంద్రబాబు టార్గెట్ గా ఎలాంటి రాజకీయం చేసిందో కూడా తెలిసిందే. పరోక్షంగా జగన్‌కు సహకరిస్తూ...బాబుని ఏ విధంగా దెబ్బకొట్టాలని చూశారో కూడా తెలిసిందే. అయితే ఈ మధ్య బీజేపీ వైఖరిలో మార్పు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వైసీపీ శ్రేణులు రాష్ట్రంలో సృష్టిస్తున్న అరాచకాలపై ఫిర్యాదు చేయడానికి చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళిన విషయం తెలిసిందే.
అక్కడ ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలని కలవాలని బాబు చూశారు...కానీ వారి అపాయింట్మెంట్లు దొరకలేదు. అయితే బాబు తిరిగొచ్చేశాక....అమిత్ షా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇక ఈ ఫోన్ తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారాయి. ముఖ్యంగా బద్వేలు ఉపఎన్నికలో పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ...పోటీలో ఉన్న బీజేపీకి కాస్త సహకారం అందించినట్లే కనిపించింది. ఎన్నిక సమయంలో టీడీపీ శ్రేణులు బీజేపీకి సహకరించాయని తెలుస్తోంది.
అలాగే కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు...బీజేపీ ఏజెంట్లుగా కూడా పనిచేశారని తెలిసింది. ఈ పరిణామాలతో బీజేపీ...మళ్ళీ బాబుని దగ్గర చేసుకునే ప్రయత్నం జరుగుతుందని ప్రచారం నడుస్తోంది. కానీ బద్వేలు ఉపఎన్నికలో సపోర్ట్ కోసమే అమిత్ షా...బాబుకు ఫోన్ చేశారని, అందుకు తగ్గట్టుగానే ఎన్నికలో టీడీపీ సపోర్ట్ తీసుకున్నారని, తర్వాత బీజేపీ మళ్ళీ రాజకీయం మారిపోతుందని అంటున్నారు. అదే సమయంలో బీజేపీకి దగ్గరవ్వకూడదనే టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. టీడీపీని దెబ్బకొట్టాలని బీజేపీ ఎన్ని కుట్రలు చేసిందో తెలుసని, కాబట్టి బీజేపీకి దూరంగా ఉంటేనే బెటర్ అంటున్నారు.