కేసీఆర్ గారు టీచర్ పోస్టులు వేయండి సారు..?

MOHAN BABU
తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేస్తారా చేయ్యరా..? అసలు సర్కార్ ఏమనుకుంటుంది? ప్రభుత్వం ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? అనే ప్రశ్నలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి. తెలంగాణ ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీని పూర్తిగా మర్చిపోయినట్లుంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది వేచి చూస్తున్నారు. నాలుగేళ్లుగా పోస్టుల భర్తీ చేపట్టక పోవడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి 6 నెలలకు  ఒకసారి టెట్, ప్రతి రెండు నెలలకు ఒకసారి డీఎస్సీ నోటిఫికేషన్ లు ఇచ్చేవారు. అయితే తెలంగాణ వచ్చాక టెట్, టిఆర్టి నోటిఫికేషన్ ల విషయంలో ప్రభుత్వ వైఖరి పూర్తిగా మారిపోయింది.


రాష్ట్రంలో ప్రస్తుతం 24 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న వాటి భర్తీకి పూనుకోవడం లేదు. తాజాగా నిర్వహిస్తున్న రేషనలైజేషన్ ప్రక్రియ తో పోస్టుల భర్తీ మరింత క్లిష్టంగా మారింది. రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సుమారు 50 వేల పోస్టులను ఇప్పటికే గుర్తించారు. అయితే ఇందులో టీచర్ పోస్టులను పరిశీలనలోకి తీసుకోవడం లేదు. దీంతో టీచర్ పోస్టుల భర్తీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అభ్యర్థుల ఆందోళనలు సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఎట్టకేలకు 2017 లో టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పటి వరకు ఉన్న డిఎస్సి పేరును టిఆర్టి గా మార్చి 2017 అక్టోబర్ 21 న నోటిఫికేషన్ విడుదల చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఈ నియామకాలు చేపట్టారు. అప్పట్లోనే మొత్తం 25 వేల పోస్టులు ఖాళీగా ఉంటే 13500ల పోస్టు లకే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం విద్యావాలంటీర్లు లేనందున మొత్తం ఖాళీలు 24 వేలకుపైగానే ఉన్నట్లు లెక్క తేలుతోంది.


టీచర్ల రేషనలైజేషన్ తర్వాత ఖాళీ పోస్టుల పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశమున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని ఖాళీ టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అభ్యర్థుల సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ పోస్టుల కోసం సంవత్సరాలుగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని సంఘం నాయకులు చెబుతున్నారు. టీచర్ల సంఖ్యను కుదించి  ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు రాష్ట్ర సర్కారు కుట్ర చేస్తోందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఆరోపిస్తున్నారు . ఇప్పటికైనా సర్కారు మేల్కొని టీచర్ పోస్టుల భర్తీ చేపట్టాలని  వారు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: