మిగిలిపోయిన ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... 13మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు షెడ్యూడ్ విడుదలైందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు ఏకమై వైసీపీని ఓడిస్తేనే రివర్స్ పాలనకు గండి పండుతుందని చంద్రబాబు చెప్పారు. వైసీపీని ఓడిస్తేనే ప్రజల ధన-మాన-ప్రాణాలకు రక్షణ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. న్యాయస్థానం నుండి దేవస్థానం యాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని చంద్రాబాబు వ్యాఖ్యానించారు. రూ.2 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి అమరావతిని నిరుపయోగం చేశారంటూ చంద్రబాబు మండిపడ్డారు.
జగన్ రెండున్నరేళ్ల పాలనలో ప్రజల్ని, రైతుల్ని సంక్షోభంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్తితి కల్పించారని....డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వ డొల్లతనం బట్టబయలైందని చంద్రబాబు అన్నారు. గంజాయి ఉందన్న వారిపై కేసులు పెట్టారని... దాడులు చేశారని చంద్రబాబు ఆరోపించారు. 3 లక్షల కిలోల గంజాయి పట్టుబడిందని పోలీసులు చెబుతున్నారని....మద్యనిషేధం పేరుతో సొంత, నకిలీ మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్దారంటూ చంద్రాబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల పుస్తెలు కాపాడుతానని.. నేడు తాకట్టు పెడుతున్నారు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా టీడీపీ పోరాటం చేస్తుందని....ఎయిడెడ్ స్కూళ్ల ఆస్తుల కోసం బడి పిల్లలను బజారుకీడ్చారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. యధావిధిగా ఎయిడెడ్ వ్యవస్థ ఉంటుందని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుందని...జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంతో రైతుల అవస్థలు పడుతున్నారని....రైతు ఆత్మహత్యల్లో 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని చంద్రబాబు తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ చంద్రబాబు మండి పడ్డారు.