కేసీఆర్ vs ఈటల : ఓటమి ఈటల హిస్టరీలోనే లేదు..!
అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకంటే ఇప్పుడే ఈటలకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. 2018లో టీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచిన ఈటలకు లక్షా 4వేల 840 ఓట్లు రాగా.. ఇప్పుడు లక్షా 6వేల 780ఓట్లు పడ్డాయి. దాదాపు 2వేల ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డికి 61వేల 121ఓట్లు వచ్చాయి. బీజేపీకి కేవలం 16వందల 63ఓట్లు మాత్రమే పడ్డాయి.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటలను ఓడించేందుకు టీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డింది. పోలింగ్ కు 3, 4నెలలకు ముందే మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లి ప్రచారం మొదలుపెట్టారు. ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన హరీశ్ రావు అక్కడే మకాం వేశారు. వందల కోట్ల రూపాయలతో కొత్తగా రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేశారు. అయితే ఇవన్నీ ఆ పార్టీ విజయానికి దోహదపడలేదు.
తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు, అణచివేత, దోపిడీ రాజ్యం నడుస్తోందని.. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసేందుకు ఉద్యమబిడ్డల గొంతునొక్కేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధును అమలు చేయాలనీ.. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేశారు. దళితబంధు తరహాలో పేదలందరికీ ఆర్ధిక సాయం చేయాలన్నారు. కష్టాలను ఓర్చుకొని పనిచేసిన కార్యకర్తలకు ఈటల ధన్యవాదాలు తెలిపారు. చూద్దాం.. ఈటల ఉపఎన్నికలో గెలిచిన ఉత్సాహంతో ప్రజలకు ఏం మేలు చేస్తారో.