కేసీఆర్‌ Vs ఈటల: బీజేపీలో సంతోషం.. నాయకుల్లో గుబులు

Deekshitha Reddy
దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నష్టపోయింది. పశ్చిమబెంగాల్ లో తృణమూల్ చేతిలో ఖంగుతింది, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ చేతిలో మట్టికరిచింది. దీంతో ఒకటి రెండు విజయాలే ఆ పార్టీకి ఆనందాన్నిచ్చాయి. అందులో తెలంగాణ ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల ఉప ఎన్నికలు జరగగా.. బద్వేల్ లో కనీసం డిపాజిట్లు రాలేదు, హుజూరాబాద్ లో గెలుపు మాత్రం బీజేపీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఆ పార్టీకి తెలంగాణలో మూడో అసెంబ్లీ స్థానాన్ని సంపాదించి పెట్టింది. అయితే ఈటల చేరిక, తద్వారా వచ్చిన అసెంబ్లీ స్థానంతో బీజేపీ అధిష్టానం సంబరపడుతున్నా.. స్థానిక నాయకులు మాత్రం గుబులుగా ఉన్నారు.

ఈటల పోటీకి వస్తారా..?
ఇప్పటి వరకూ ఈటలను తమకు పోటీగా స్థానిక బీజేపీ నాయకులు అనుకోలేదు. ఈటల హుజూరాబాద్ కే పరిమితం అయితే పర్లేదు, అదే సమయంలో ఆయన రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెడితే మాత్రం బండి సంజయ్ వంటి నేతలకు కష్టమే. ఎందుకంటే ఈటల ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. బీజేపీలో ఉద్యమ నేపథ్యం ఉన్నవారు కీలక స్థానాల్లో ఉన్నా కూడా ఈటల ముందు వారు బలాదూర్ అనే చెప్పాలి. టీఆర్ఎస్ లో ఈటల రాజేందర్ చేసిన పోరాటాలను ప్రజలు ఇంకా గుర్తుంచుకున్నారు. అందుకే కేసీఆర్ ని కాదని ఈటలకు పట్టం కట్టారు.

ఈటల టార్గెట్ ఏంటి..?
టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఈటల రాజేందర్ ఓ దశలో సొంత పార్టీ పెట్టాలనుకున్నారు. అలా ఆయన పార్టీ పెట్టి ఉంటే ఆయనే రాజు, ఆయనే మంత్రి. ఆ పార్టీ తరపున ఆయనే రేపు సీఎం అభ్యర్థి. అయితే ఈటల అనూహ్యంగా బీజేపీ పంచన చేరారు. అప్పటికప్పుడు కేసుల విషయంలో ఆయన కొంత కలవరపడ్డారని అంటారు సన్నిహితులు. బీజేపీ వంటి జాతీయ పార్టీ మద్దతు లేకపోతే.. కేసీఆర్ తనని రాజకీయంగా ఇబ్బంది పెడతారని అర్థం చేసుకున్నారు. తన సొంత స్టామినాపై నమ్మకం ఉన్నా కూడా దానికి బీజేపీ బలం కలసి రావాలనుకున్నారు. ఒకరకంగా బీజేపీలో చేరి ఈటల మంచి పనే చేశారని ఈ ఫలితాలతో రుజువైంది. హుజూరాబాద్ విజయం పూర్తయింది, ఇప్పుడాయన నెక్స్ట్ టార్గెట్ ఏంటనేదే అసలు ప్రశ్న. వచ్చే దఫా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నాయకులు నమ్ముతున్నారు. అందులో ఈటల వాటా ఎంత..? ఒకవేళ ఈటల జోరు చూపిస్తే.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆయన ముందు నిలబడగలరా..? పోనీ తమవారిని కాదని.. ఈటలను బీజేపీ అధిష్టానం నెత్తినెక్కించుకుంటుందా..? వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: