బద్వేలుతో బీజేపీ బలపడిందా? ఎక్కువ ఊహించుకుంటున్నారా?
అయితే డిపాజిట్ దక్కకపోయినా.. పార్టీ బాగా బలపడిందని, అలాగే వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న అప్రజాస్వామ్య విధానాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యామని బీజేపీ భావిస్తుంది. అందుకే బద్వేలులో ఇన్ని ఓట్లు పడ్డాయని అంటుంది. అసలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే ఫలితాలు ఎలా ఉండేవో అందరికీ తెలుసని, నైతిక విజయం తమదే అని బద్వేలు బీజేపీ అభ్యర్ధి మాట్లాడుతున్నారు.
అంటే 21 వేల ఓట్లకే బీజేపీ బలపడిపోయిందని సంబరపడిపోతుంది. కానీ ఈ ఓట్లని చూసి బీజేపీ నేతలు, తమని తాము ఎక్కువ ఊహించుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సరే బీజేపీకి ఇప్పుడు 21 వేల ఓట్లు పడ్డాయి...మరి గత ఎన్నికల్లో బీజేపీకి పడింది...735 ఓట్లే...మరి అప్పటికి ఇప్పటికీ బీజేపీలో పెద్ద మార్పు ఏం వచ్చింది. అసలు బీజేపీ రాష్ట్రం కోసం ఏం చేస్తుందని ఓట్లు వేస్తారనే విషయాన్ని కూడా ఒక్కసారి చూడాలి.
కేవలం టీడీపీ పోటీలో లేకపోవడం వల్లే కొన్ని ఓట్లు బీజేపీకి వెళ్ళాయని చెప్పొచ్చు. అలాగే టీడీపీలోని దళిత ఓటర్లు కొందరు....వైసీపీకి కూడా ఓటు వేశారని తెలుస్తోంది. ఇంకా కొందరైతే ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అంటే బీజేపీకి పడిన ఓట్లు టీడీపీకి సంబంధించినవే..అందులో వేరే డౌట్ లేదనే చెప్పాలి. పైగా ఇక్కడ జనసేనకు కూడా ఓట్లు లేవు..కాబట్టి టీడీపీ ద్వారా వచ్చిన ఓట్లని తమ బలంగా భావిస్తే అది బీజేపీ ఊహ తప్ప మరొకటి లేదనే చెప్పాలి.