పెట్రో మంటలు: మోడీని కడిగిపారేసిన జగన్..?
ఈ మేరకు ప్రజలకు సమాచారం ఇస్తూ జగన్ సర్కారు పత్రికల్లో ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చింది. ఈ ప్రకటనల్లో కేంద్రానికి జగన్ గట్టిగానే సమాధానం ఇచ్చారు. పెట్రో ధరలు పెంచాల్సినంత పెంచేసి, ఆటవిడుపులా ఇప్పుడు అరకొరగా తగ్గించారంటున్నారు జగన్.. పైగా రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలుపుతామంటున్నారని నిరసించారు. ఐదో, పదో తగ్గించి.. దాన్ని రాజకీయానికి వాడుకుందామని కేంద్రం,బీజేపీ ప్రయత్నిస్తున్నాయని జగన్ విమర్శించారు.
కేంద్రం సర్ చార్జీలు, సెస్‌లు పేరిట చేస్తున్న వసూళ్లలో రాష్ట్రాలకు వాటా లేకుండా చేసిందని జగన్ సర్కారు విమర్శిస్తోంది. రాష్ట్రాలను మోసం చేసిన బీజేపీ పార్టీయే ఇప్పుడు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నారని వైసీపీ సర్కారు ఎదురుదాడి చేసింది. పనిలో పనిగా టీడీపీని కూడా వదల్లేదు జగన్ సర్కారు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు భారీగా పెట్రో బాదుడు బాది.. ప్రజల నడ్డి విరిచేసిందని మండిపడింది. ఇప్పుడు టీడీపీ గతం మరిచిపోయి, తాము పెంచిన పన్నులను తగ్గించాలని కొత్తపాట అందుకొందని ఎద్దేవా చేసింది వైసీపీ సర్కారు.
పెట్రోలు, డీజిలు మీద కేంద్రం వసూలు చేస్తున్న మొత్తం పన్నుల్లో రాష్ట్రాల వాటా కేవలం 5.8 శాతానికే పరిమితమైందని జగన్ సర్కారు గుర్తు చేస్తోంది. వాస్తవంగా అయితే నేరుగా పన్నుల పేరిట వసూలు చేస్తే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని.. కానీ సెస్‌లు, సర్ చార్జీలు, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, అదనపు ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్రం దగా చేస్తోందని విమర్శిస్తోంది.