తెలంగాణ : బీజేపీ పెద్దలంతా ఎటేపో తెల్సా?

RATNA KISHORE
హుజురాబాద్ ఎన్నిక‌ల త‌రువాత పొలిటిక‌ల్ సీన్ అండ్ సినేరియో అంతా మారిపోయాయి. ఇప్పుడు బీజేపీ పెద్ద‌లు ఎటువైపు ఉన్నారో అన్న‌ది తేల్చుకోవ‌డ‌మే అతి పెద్ద చ‌ర్చ‌గా ఉంది. ముఖ్యంగా ఈటెల రాజేంద‌ర్ ను ఎంక‌రేజ్ చేసి తెలంగాణ‌లో మ‌రింత బ‌ల‌ప‌డాలి అని భావిస్తున్న బీజేపీ, అదే స‌మ‌యంలో టీఆర్ఎస్ తో స్నేహాన్నీ వ‌దులుకోలేక‌పోతోంది. గులాబీ దండు ఢిల్లీలో వ‌సంత విహార్ లో స్థ‌లం కేటాయించి తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణానికి స‌మ్మ‌తించింది. 



అంతేకాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో  కూడా కేసీఆర్ మ‌నుషుల‌కు బీజేపీ మంచి సాయమే చేయ‌నుంది. ఇటు కేసీఆర్ కానీ అటు జ‌గ‌న్ కానీ బీజేపీకి అండ‌గా ఉండేందుకే ఇష్ట‌ప‌డుతున్నారు. ద‌క్షిణాదిలో విభిన్న రాజ‌కీయ వాతావ‌ర‌ణం న‌డుస్తుండ‌డంతో కాస్త‌యినా ప‌ట్టు పెంచుకునేందుకు స్థానిక పార్టీల సాయం అడుగుతున్నారు బీజేపీ పెద్ద‌లు. అయితే ఒడిశాలో, కేర‌ళ‌లో బీజేపీ ఆట‌లు సాగ‌డం లేదు. పొరుగున ఉన్న త‌మిళ నాడులో మాత్రం శ‌శిక‌ళ కేంద్రంగా కొంత రాజ‌కీయం న‌డ‌పాల‌ని భావిస్తోంది బీజేపి. అక్క‌డి ముఖ్య‌మంత్రి స్టాలిన్ (డీఎంకే అధినేత‌) బాగా ప‌నిచేస్తూ ముందుకు దూసుకుపోతుండ‌డంతో అన్నా డీఎంకే ఎదుగుద‌ల‌ను ఇక అక్క‌డ ఆశించ‌డం క‌ష్ట‌మే. అయితే డీఎంకే లో ఏమ‌యినా అళ‌గిరి వ‌ర్గాన్ని  త‌న‌వైపు తిప్పుకునే కుట్ర‌లు చేస్తే త‌ప్ప బీజేపీ త‌మిళ నాట ఈల వేయ‌డం క‌ష్ట‌మే.



ఈ క్ర‌మంలో తెలంగాణ‌, ఆంధ్రా క‌లిపి న‌ల‌భై ఎంపీ సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఇప్ప‌టికైతే పెద్ద‌ల స‌భ‌లో కూడా బీజేపీకి మంచి ప‌ట్టే ఉంది. క‌నుక తాను అనుకున్న‌వ‌న్నీ  చ‌క్క‌దిద్దుకోవ‌డంలో స‌ఫ‌లీకృతం అవుతోంది. కానీ ఉత్త‌రాది పార్టీలు కొన్ని బీజేపీని  ముందు నుంచి వ్య‌తిరేకిస్తున్నాయి. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై పంజాబ్, హ‌ర్యానా రాష్ట్రాలు ఇప్ప‌టికే అస‌మ్మ‌తి స్వ‌రాన్ని వినిపిస్తున్నాయి. ఈశాన్యంతో బీజేపీకి పెద్ద గా విభేదం లేక‌పోయినా కీలకం అయిన ఉత్త‌రాదిలో నెగ్గుకు రావ‌డమే అస‌లు సమ‌స్య. ప‌శ్చిమ బెంగాల్ లో తృణ‌ముల్ కాంగ్రెస్ బ‌ల‌ప‌డితే ఆ ఫ‌లితం వేరుగా ఉంటుంది. బీహార్ లో కూడా ప్రాంతీయ శ‌క్తులు బ‌ల‌ప‌డితే జాతీయ పార్టీకి చుక్క‌లే చుక్క‌లు. ఇలా ఎక్క‌డ చూసుకున్నా కూడా బీజేపీ పై ఉన్న వ్య‌తిరేక‌త ప్రాంతీయ శ‌క్తుల‌కు త‌దనుగుణ పార్టీల‌కు లాభం చేకూర్చే విష‌య‌మే. అందుకే బీజేపీ తెలివిగా అయితే ప్రాంతీయ పార్టీల‌లో చీలిక తేవ‌డం లేదంటే వారితో దోస్తీ అంటూ కౌగిలించుకుని గొంతెమ్మ కోర్కెలు ఏవ‌యినా ఉంటే తీర్చి  పంపడం అన్న ప‌నులేవో చేస్తూ స‌ర్దుకుపోతోంది. క‌నుక ఈటెల ఎంత దూసుకుపోయినా బీజేపీలో త‌న హ‌వాను కొన‌సాగించ‌డం క‌ష్టం. కేసీఆర్ హ‌వా ఇక్క‌డ అంటే బీజేపీ లో ప్ర‌బ‌లంగా ఉన్నంత వ‌ర‌కూ ఈటెల‌కు క‌ష్ట‌మే!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: