తెలంగాణ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న గులాబీ అధినేత సీఎం కేసీఆర్.. ఎవరిని ఎక్కడ పెట్టాలో ఆయనకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదనే చెప్పాలి. అవసరం ఉంటే నాలుగడుగులు ముందుకు వేసేందుకు గానీ, అనవసరం అనుకుంటే రెండు అడుగులు వేసేందకు కూడా వెనకాడని విధంగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటాడు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు బలం లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు.
అందుకే మొదటి సారి ప్రభుత్వం ఏర్పాటు చేసన తరువాత ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గులాబీ కండువాను కప్పి తన పార్టీలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్షాల్లో ఉన్న బలహీనతను తనకు బలంగా మార్చుకున్నాడు. కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత కలాహాలు, బీజేపీ కి ఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకులు లేకపోవడం. టీఆర్ఎస్కు అనుకూలంగా మారింది. ప్రతిపక్షాల్లో ఉన్న అనైక్యతను తన ఐక్యతగా మార్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే కొత్త రూపు సంతరించుకున్న కాంగ్రెస్ పార్టీలో హుజురాబాద్ ఓటమితో మళ్లీ అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయని చెప్పొచ్చు.
కీలక నేతల్లోనే సమన్వయం లోపించడంతో అధికార పక్షానికి వ్యతిరేకంగా గళం విప్పడానికి వెనుకడుగు వేస్తున్నారు. పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలతో ఒకరిపై ఒక విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడంలోనే బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్పై పోరాడేందుకు సమయం లేకుండా పోయింది. పార్టీ ఏమైతే నాకెందుకు అనే స్థితికి చేరిపోయారు. మరోవైపు తెలంగాణలో ఇప్పుడిప్పుడే బలపడుతుందనుకుంటున్న బీజేపీకి ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి పోటీ ఇచ్చి విజయం తెచ్చిపెట్టే బలమైన నాయకులు లేరు. ఇది బీజేపీ పై తీవ్ర ప్రభావం చూపుతున్న అంశం. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న రఘునందన్‌రావు, మొన్ననే ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల లాంటి బలమైన నాయకులు బీజేపీ కి ఉంటే భవిష్యత్తులో కాషాయ దళం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.