కెసిఆర్ నెక్ట్స్ స్టెప్ ఏంటి ?
కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు తదుపరి ఏం చేయబోతున్నాడు ? ఇది రాష్ట్రంలో జరుగతున్న చర్చ. తెలుగు రాష్ట్రాల లోనే కాదు,యావత్ భారత్ లోని వివిధ రాజకీయ పక్షాలలో జరుగుతున్న చర్చ. అదివారం మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఅర్ నిప్పులు చెరిగారు. ఎవరిపైనా ? ఎవర్నీ వదల లేదు. తన వాగ్దాటితో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడం ద్వారా మీడియాను, తద్వారా జనాన్ని ఆకర్షించడం కేసిఆర్ నైజం. ఆయన రాజకీయ జీవితాన్ని పరిశీలించిన వారికి ఇది ఎరుకే. పొడిగిన నోటితోనే, ఆ మరుక్షణమే ఎదుటి వ్యక్తి నివ్వెర పోయోలా తిట్టగల సమర్థుడాయన.
హుజూరా బాద్ ఎన్నికల్లో టిఆర్ ఎస్ అభ్యర్థి పరాజయం పాలైన తరువాత కేసిఆర్ మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. జనం ఏమనుకున్నా... రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నా ,ఒక్క సారి మీడియా ముందుకు వచ్చి ఒక్క సారి ఘీంకరిస్తే చాలు, జనం మరలా తన వైపే ఉంటారనేది కెసిఅర్ బలమైన నమ్మకం. ఆ తరువాత జనం ఎటూ రాజకీయ నాయకుల మాటలు మర్చి పోతారు. ఇది అందరికీ తెలిసిన విషయం. హూజూరాబాద్ లో టిఆర్ ఎస్ అభ్యర్థి ఓటమి పాలవడం కన్నా, ప్రత్యర్థి ఈటల రాజేందర్ గెలవడం కెసిఆర్ ను మరింత బాధించిదని ఆ పార్టీ నేతలే బాహిరంగంగా పేర్కొంటున్నారు. మీడియా సమావేశంలో కెసిఅర్ దేశంలో అన్ని అంశాలనూ తనదైన శైలిలో ప్రస్తావంచారు. కేంద్ర ప్రభత్వ చర్యలపై మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో రైతులు గత కొద్ది మాసాలుగా పోరాటాలు చేస్తున్నాారు. ఇప్పటి దాగా ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించని కెసిఆర్ హఠాత్తుగా రైతు సమస్యలపై గర్జించారు. తన మంత్రి మండలితో సహా ఢిల్లీలో ధర్నా చేస్తానని కేంద్ర ప్రభుత్వాన్ని తద్వారా భారతీయ జనతా పార్టీని హెచ్చరించారు. ఇటీవల దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి కి ధీటుగా ఇతర రాజకీయ పక్షాలు సీట్లు సాధించుకోవడంతో కెసిఅర్ తన మానస పుత్రిక ఫెడర్ ఫ్రంట్ ను తెరమీదకు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది.