లారీ ఓనర్ల డిమాండ్ లో అంత ఆంతర్యముందా..?
దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే డీజిల్ ధరలు అత్యధికం. పెట్రోల్ ధరలో రాజస్థాన్ తొలిస్థానంలో ఉండగా.. డీజిల్ ధర మాత్రం ఏపీలోనే ఎక్కువ. ఏపీలో లీటర్ డీజిల్ ధర 96రూపాయల 14పైసలు ఉండగా.. రాజస్థాన్ లో 95రూపాయల 71పైసలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో డీజిల్ పై 22.25శాతం వ్యాట్ ఉండగా.. లీటరుకు 4రూపాయల అదనపు వ్యాట్, రోడ్ అభివృద్ధి సెస్ కింద రూపాయి చొప్పున పన్ను వేస్తున్నారు. రాజస్థాన్ లో 26శాతం వ్యాట్, 1.75చొప్పున రోడ్డు అభివృద్ధి సెస్ విధిస్తున్నారు.
ఇక తెలంగాణలోనూ తమ సమస్యలను వారంలోగా ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్ర లారీ ఓనర్ల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సమస్యలను గడువులోగా పరిష్కరించకుంటే సమ్మె చేస్తామని హెచ్చరించింది. గతంలో పలుమార్లు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో సమ్మెపై ప్రకటన చేయాల్సి వచ్చిందని పేర్కొంది. డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గించినట్టే రాష్ట్రం కూడా పన్ను తగ్గించాలని కోరింది.
ఇక ఇంధన ధరలపై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు ప్రకటించగానే.. చాలా రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ఇప్పటి వరకు 23రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాట్ తగ్గించాయి. ఇందులో దాదాపు అన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే. మరోవైపు దేశంలోనే తొలిసారిగా ఇంధన ధరలపై వ్యాట్ తగ్గించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. లీటర్ పెట్రోల్ పై 10రూపాయలు, డీజిల్ పై 5రూపాయలు తగ్గుతాయని ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ తెలిపారు.