కుప్పంలో వింత నిరసన: కమిషనర్ కు పసుపు కుంకుమ

Deekshitha Reddy
కుప్పం మున్సిపాల్టీ ఎన్నికలు రసాభాసగా మారుతున్నాయి. మొదట్నుంచి అక్కడ అధికార వైసీపీపై టీడీపీ విమర్శలు చేస్తూనే ఉంది. అధికారులంతా వైసీపీకి కొమ్ముకాస్తున్నారని ఆందోళన చేస్తున్నారు టీడీపీ నేతలు. నామినేషన్ల విత్ర డ్రా రోజు రాత్రి హైడ్రామా కొనసాగింది. మధ్యాహ్నానికే పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటించాల్సిన రిటర్నింగ్ అధికారి.. రాత్రి అయినా జాబితా ఇవ్వకపోవడంతో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. నిరసనలో భాగంగా కుప్పం మున్సిపల్ కమిషనర్ కు చీర, పసుపు, కుంకుమ అంజజేయడానికి తీసుకొచ్చారు టీడీపీ నేతలు.

కుప్పం మున్సిపల్ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో అక్కడ టీడీపీ పట్టు తగ్గిపోవడంతో స్వయానా చంద్రబాబు ఎన్నికలకు ముందుగా కుప్పంలో పర్యటించారు. స్థానిక నాయకులతో చర్చించి బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపారు.. అభ్యర్థులకు స్థానిక నాయకులు ఆర్థిక సాయం చేసి వారికి అండగా నిలబడాలని సూచించారు. తన సొంత నియోజకవర్గంలో టీడీపీ పట్టు కోల్పోకూడదని సూచించారు చంద్రబాబు. ఈ క్రమంలో నామినేషన్ల రోజే కుప్పంలో హడావిడి జరిగింది. ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణ రోజు మరింత గొడవ జరిగింది. 14వ వార్డులో తమ అభ్యర్థి రాకుండానే ఉపసంహరణ చేసుకున్నట్టు ప్రకటించారని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.

ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కుప్పం మున్సిపల్ కమిషనర్ అధికార పార్టీ చెప్పినట్టు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు సోమవారం సాయంత్రం కుప్పం మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగాయి. దీంతో పోలీసులు కూడా అక్కడ అదనపు బలగాలను మోహరించారు. రాత్రి వరకు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఆర్వో ప్రకటించకపోవడంపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మంత్రి అమరనాథ రెడ్డి కూడా ఆందోళనల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. మొత్తమ్మీద కుప్పం విషయంలో అనుకున్నదే జరిగింది. ఎన్నికలకు ముందే అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ సై అంటే సై అంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: